ఇది చర్చించే కమిటీనా? బెదిరించే కమిటీనా?

పీఆర్సీ మీద గొడవ ముదురుతోంది. సమ్మెనోటీసుకూడా ఇచ్చేశారు. వైద్య సేవల విషయంలో కూడా ఆయా రంగాల ఉద్యోగులు ప్రత్యేకంగా సమ్మెనోటీసు ఇచ్చారు. ప్రభుత్వం మంత్రుల కమిటీ అనే పేరు మీద అయిదుగురితో కమిటీ ఏర్పాటు చేసి ముగ్గురు మంత్రులను అందులో నియమించింది. దాన్ని గుర్తించడంలేదని ఉద్యోగులు ప్రకటించి.. ఇంకాస్త వేడిపెంచారు. అయితే.. సదరు కమిటీ సోమవారం నాడు సమావేశం కావడం.. అనంతరం.. మీడియాతో మాట్లాడడం గమనిస్తే.. వారు ఉద్యోగులను చల్లబరచి.. పరిస్థితి విషమించకుండా ఉండడానికి ఏర్పాటు చేసిన కమిటీనా? వారిని బెదిరించి, మెడలు వంచి పనిచేయించడానికి ఏర్పాటు చేసిన కమిటీనా అనే అనుమానం కలుగుతోంది.

ఉద్యోగులు సమ్మె నోటీసు అందజేసినా సరే.. చర్చలకు రావాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఈ కమిటీకి ఏం అధికారం ఉందని ఉద్యోగులు అడగడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అది ఎక్స్‌ట్రీమ్‌కు వెళ్లడం అని కూడా అన్నారు. ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుంది అని అంటున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగులు విషప్రచారం చేస్తున్నారని, ప్రభుత్వం ఎంత చేసిందో వాలంటీర్ల ద్వారా చెప్పిస్తున్నాం తప్ప.. వారి మీద విషప్రచారం చేయడం లేదని ఆయన సమర్థించుకున్నారు. ఈ వ్యవహారం అంతా బుజ్జగించే ధోరణిలో ఉందని అనిపించడం లేదు. బెదిరించే ధోరణిలో ఉంది.

ఈ కమిటీని గుర్తించడంలేదని ఉద్యోగులు అనడాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు.. అలాంటి మాటలు ప్రభుత్వానికి, కమిటీకి అవమానకరంగా ఆయనకు అనిపించి ఉండవచ్చు. మరి ఉద్యోగుల ఉద్యమాల పట్ల ప్రభుత్వం స్పందించిన తీరేమిటి? జిల్లా కలెక్టరేట్ల ఎదుట.. టీచర్లు ఉద్యోగులు.. ప్రతి జిల్లాలోనూ వేల సంఖ్యలో జిల్లా కేంద్రాలకు తరలివచ్చి.. తమ తమ నిరసనలను పెద్దఎత్తున తెలియజేస్తే.. కేబినెట్ భేటీ తర్వాత.. మీడియాతో మాట్లాడిన మంత్రి పేర్ని నాని.. ఉద్యోగుల ఆందోళనల సంగతి తమ దృష్టికి రాలేదని అన్నప్పుడు.. ఉద్యోగులు ఎంత అవమానకరంగా ఫీలై ఉంటారు? అదే పేర్ని నాని ఈ కమిటీలో ఉన్నప్పుడు.. అలాంటి కమిటీ ద్వారా.. ఏకొంతైనా న్యాయం జరుగుతుందని ఎలా నమ్ముతారు?

ఇలాంటి విషయాలేమీ ఆలోచించకుండా.. కమిటీ గానీ, చర్చలు గానీ.. సమస్య పరిష్కారాన్ని లక్ష్యించినవి కాకుండా.. ఉద్యోగుల మెడలు వంచడానికి ఉద్దేశించినవని అనుకున్నట్టుగా ప్రభుత్వం తీరు కనిపిస్తోంది. ఈ కమిటీతో సమస్య ముందుకు వెళుతుందో.. వెనక్కి వెళుతుందో వేచిచూడాలి మరి!