వైసీపీ టీం..నిధుల కోసం ఢిల్లీలో వేట!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఖర్చులు పెరిగిపోతున్నాయి.. పలు పథకాలు అమలు చేయాలంటే డబ్బు కావాలి.. రాష్ట్ర బడ్జెట్ పరిస్థితీ అంతంత మాత్రమే.. కేంద్రప్రభుత్వం కూడా నిధలడిగితే మొహం తిప్పుకుంటోంది.. రాష్ట్ర పెద్దలకు ఏం చేయాలో తోచడం లేదు. అందుకే పట్టువదలని విక్రమార్కుడులా కేంద్రం వద్దకు పదే పదే నిధుల కోసం వెళుతున్నారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి కూడా ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఇక రాష్ట్ర ఎంపీలు కూడా కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర పరిస్థితిని వివరిస్తున్నారు. రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీలు మంగళవారం కేంద్ర మంత్రులను కలిసి నిధుల కోసం వినతిపత్రం సమర్పించారు. కేంద్ర పంచాయితీ రాజ్  శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ను కలిసి రూ.6,750 కోట్ల నిధులు విడుదల చేయాలని కోరారు.

ఆ తరువాత రోడ్ ట్రాన్స్ పోర్ట్ అండ్ హైవే మినిస్టర్ నితిన్ గడ్కరి వద్దకు వెళ్లారు. సబ్బవరం..నర్సిపట్నం..తుని మార్గంలో పెండింగ్ పనులను పూర్తి చేయాలని, రాష్ట్ర అభివద్దికి సహకరించాలని కోరారు. పనిలో పనిగా రాష్ట్రంలో చేపడుతున్న సంక్షేమ పథకాలను వివరించారు.  ఈ నేపథ్యంలో పేద విద్యార్థులకు తాము ల్యాప్ టాప్ లు అందజేస్తున్నామని, విద్యావిధానంలో సరికొత్త మార్పులు తీసుకొస్తున్నామని చెప్పినట్లు తెలిసింది. అయితే కేంద్ర మంత్రులు ఎంపీలకు ఎటువంటి హామీ ఇవ్వలేదని సమాచారం. విజయసాయితోపాటు ఎంపీలు  మార్గాని భరత్, మిథున్ రెడ్డి, మోపిదేవి వెంకటరమణ ఉన్నారు.