ఏపీలో వైకాపా-కాంగ్రెస్ క‌లుస్తాయా..!

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయ ఫ‌లితాలు దేశ‌రాజ‌కీయ ముఖ చిత్రాన్నేమార్చిన ఘ‌ట‌న‌లు గ‌తంలో చాలానే ఉన్నాయి. హ‌స్తిన పీఠాన్నికాంగ్రెస్‌కు దూరం చేసిన జాతీయ స్థాయి విప‌క్ష కూట‌మి ఏదైనా.. అందులో టీడీపీ పోషించిన కీల‌క పాత్ర‌ను గుర్తుకు తెచ్చేదే. ఒక‌ర‌కంగా కాంగ్రెస్ పార్టీ పంతం ప‌ట్టి మ‌రీ రాష్ట్రాన్ని అడ్డ‌గోలుగా విభ‌జించ‌డానికి కూడా టీడీపీ మీద, ఆ పార్టీ అధినేత చంద్ర‌బాబు పైనా.. ఆ పార్టీలో పేరుకుపోయిన క‌క్షే కార‌ణమ‌ని భావించేవారి సంఖ్య త‌క్కువేమీ కాదు.  రాష్ట్ర విభ‌జ‌న త‌రువాత ఏపీ ఢిల్లీ రాజ‌కీయాల‌పై చూపించ‌గ‌ల ప్ర‌భావం గ‌ణ‌నీయంగా త‌గ్గిపోతుంద‌ని చాలామంది రాజ‌కీయ విశ్లేష‌కులు భావించారు. అయితే ప‌రిస్థితి ప్ర‌స్తుతం అందుకు భిన్నంగానే క‌నిపిస్తోంది.

ఇందుకు ప్ర‌ధాన‌ కార‌ణంగా.. ముందుగా ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునే చెప్పుకోవాలి. రాష్ట్ర విభ‌జ‌న తరువాత క్లిష్ట ప‌రిస్థితుల్ని ఎదుర్కొంటున్న ఏపీని బాల్యారిష్టాల‌నుంచి ఒడ్డున ప‌డేసేందుకు ఆయ‌న చూపిన ఓర్పూ నేర్పు, అన్నింటికీ మించి రాజ‌ధానికి భూసేక‌ర‌ణ కోసం చంద్ర‌బాబు అనుస‌రించిన విధానం, ఏపీని పెట్టుబ‌డులు ఆక‌ర్షించ‌గ‌ల రాష్ట్రంగా ఇంత త‌క్కువ స‌మ‌యంలోనే సిద్ధం చేయ‌డం.. ఇప్పుడు దేశ‌ప్ర‌జ‌ల‌ను విశేషంగా ఆక‌ర్షిస్తున్నాయి. ఏపీలో సొంతంగా బ‌ల‌పడేందుకు కొద్దికాలం క్రితం వ‌ర‌కూ గట్టిగానే ప్ర‌య‌త్నించిన బీజేపీ కూడా ప్ర‌స్తుతం చంద్ర‌బాబు రాజ‌కీయ చాణ‌క్యంతో పోటీప‌డ‌టం కంటే ఆయ‌న‌తో క‌లిసి ప‌య‌నించ‌డ‌మే మంచిద‌ని స్ప‌ష్ట‌మైన నిర్ణ‌యానికొచ్చింది.

ఇక‌ ఏపీలో వ‌చ్చే ఎన్నిక‌ల ఫ‌లితాలు ఏవిధంగా ఉండ‌బోతున్నాయ‌నేది ఇప్పుడు గ‌ల్లీ నుంచి ఢిల్లీ వ‌ర‌కు ఆస‌క్తి క‌లిగిస్తున్నఅంశం. నిజానికి కాంగ్రెస్ పార్టీకి ఆదినుంచీ ఆంధ్రప్రదేశ్ బ‌ల‌మైన పునాది ఉన్న రాష్ట్రం. పార్టీ క‌ష్ట‌కాలంలో ఉన్న‌పుడు ఎన్నోసార్లు కాంగ్రెస్ పార్టీని ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర‌మే ఆదుకుంది. అనంత‌రం టీడీపీ ఆవిర్భావంతో ఆ పార్టీ ప్రాబ‌ల్యానికి గండిప‌డినా ఆ పార్టీ ఇక్క‌డ బ‌లంగానే ఉంటూ వ‌చ్చింది.  ఈ నేప‌థ్యంలో.. రాష్ట్ర విభ‌జ‌న ప‌రిణామం ఆ పార్టీకి ఒక‌ర‌కంగా ఏపీలో మ‌ర‌ణ‌ శాస‌న‌మే లిఖించింది. అదే స‌మ‌యంలో తెలంగాణ‌లోనూ ఆ పార్టీ ఆశించిన ప్ర‌యోజ‌నం ద‌క్కించుకోలేక ఘోరంగా భంగ‌ప‌డింది. తెలంగాణ‌లో కాంగ్రెస్ ఏ మాత్రం ఊహించ‌ని విధంగా కేసీఆర్ సార‌థ్యంలోని ఉద్య‌మ పార్టీ అధికారం ద‌క్కించుకోవ‌డ‌మే కాకుండా అంత‌కంత‌కూ త‌న‌ ప్రాబ‌ల్యం పెంచుకుంటోంది. ఇక ఏపీలో కాంగ్రెస్ ఓటు బ్యాంకు గంప‌గుత్త‌గా వైసీపీ ఖాతాలోకి చేరిపోవ‌డంతో పార్టీ అత్యంత దీన‌స్థితికి దిగ‌జారిపోయింది.

ఈ నేప‌థ్యంలో రెండు మూడేళ్ల‌క్రితం దాకా… దేశ‌,రాష్ట్ర రాజ‌కీయాల‌ను శాసించిన కాంగ్రెస్ పార్టీ రాజ‌కీయ భ‌విత‌వ్యం ఎలా ఉండ‌బోతోందనేది  ఆస‌క్తి క‌లిగించే అంశ‌మే… నిజానికి కాంగ్రెస్ పార్టీ అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల్లో వినిపిస్తున్నఅభిప్రాయాల ప్ర‌కారం.. ఆ పార్టీ అంత నిరాశాజ‌న‌క‌మైన ప‌రిస్థితిలో ఏమీ లేద‌ట‌. దీని వెనుక ఉన్నఅంత‌రార్థ‌మేమిటంటే  కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఎక్క‌డ‌కూ పోలేద‌ని అది వైసీపీ రూపంలో భ‌ద్రంగానే ఉంద‌ని ఆ పార్టీ సీనియ‌ర్ నేత‌లు ఇప్ప‌టికీ విశ్వ‌సిస్తున్నారు. వారి వ్యూహం ప్ర‌కారం…ఏపీకి సంబంధించినంత వ‌ర‌కూ.. వైసీపీ.. బీజేపీ ఒక‌దానితో ఒక‌టి జ‌ట్టు క‌ట్టే ప‌రిస్థితే ఉత్ప‌న్నం కాదు.   ఎందుకంటే ఈ రెండు పార్టీల ఓటు బ్యాంకులు ప‌ర‌స్ప‌రం భిన్న‌మైన‌వి. అంటే భ‌విష్య‌త్తులో వైసీపీ కాంగ్రెస్‌లో క‌ల‌వ‌క త‌ప్ప‌ద‌న్న‌మాట‌. అప్పుడు త‌మ ఓటు బ్యాంకు త‌మ‌కు తిరిగి వ‌చ్చేసిన‌ట్టే క‌దా… సో… ఈ క‌ష్టాలు.. తాత్కాలిక‌మేన‌న్న‌మాట‌. ఇదీ వారు చెపుతున్న‌ది.  అంటే ఈ ఏపీలో కాంగ్రెస్ భ‌విష్య‌త్తుపై ఆ పార్టీ నేత‌ల‌కు గొప్ప ఆశ‌లే ఉన్నాయ‌న్న‌మాట‌. రాజ‌కీయాలంటే ఇలాగే ఉంటాయి మ‌రి.