సినీ ఇండస్ట్రీలో టాలీవుడ్ హీరోస్ అంతా పాన్ ఇండియా లెవెల్లో సినిమాలో నటిస్తూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఎలాగైనా పాన్ ఇండియా లెవెల్లో ఇమేజ్ను సంపాదించుకోవాలని.. బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుని.. మార్కెట్ ను పెంచుకోవాలని తెగ ఆరాట పడిపోతున్నారు. ఈ క్రమంలోనే మన తెలుగు హీరోలు అన్ని భాషల్లోనూ వారే స్వయానా డబ్బింగ్ కూడా చెప్తూ కష్టపడుతున్నారు. సినిమా సక్సెస్ కోసం అన్ని ప్రాంతాలకు వెళ్లి ప్రమోషన్స్ చేస్తూ వాళ్ళ ప్రశ్నలకు ఓపిగ్గా జవాబులు చెబుతున్నారు.
అలా టాలీవుడ్ సినిమాలపై.. పాన్ ఇండియా లెవెల్లో అభిమానులకు కూడా ఆసక్తి పెరిగింది. ఈ క్రమంలోనే టాలీవుడ్ సినిమాల జోరు ఇప్పట్లో అగేలాకూడా కనిపంచట్లేదు. కానీ ఎంతసేపు పాన్ ఇండియా సినిమాలను రూపొందించాలని మేకర్స్ చూస్తున్నారు తప్ప.. కథలో కంటెంట్ ఆడియన్స్ కు నచ్చుతుందా.. లేదా.. అనే దానిపై ఎవరు ఆసక్తి పెట్టడం లేదు. కేవలం హీరో పాత్రను హైలైట్ చేయాలని ఉద్దేశంతో హీరోని మాత్రమే ఆలోచిస్తూ కథను రాస్తున్నారు.
సినిమాలో పేరుకు మాత్రమే హీరోయిన్ ఉన్నా.. కేవలం గ్లామర్ కోసమే ఆమెను ఏదో మూల ఇరికించి అవసరం లేని పాటల్లో అందాల ఆరబోత చేయిస్తున్నారు. కనీసం హీరోయిన్ చూసైనా ఆడియన్స్ వస్తారని దర్శకులు భావిస్తున్నారో ఏమో కానీ.. వారి ఆశలు మాత్రం ఫలించడం లేదు. అలా కొన్ని సినిమాలు ఫ్లాప్‌లుగా నిలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. కేవలం కథలో కంటెంట్ ఉంటేనే సినిమా సక్సెస్ అవుతుందని ఇప్పటికే మన టాలీవుడ్ ప్రేక్షకులు ఎన్నోసార్లు రుజువు చేశారు. ఇది ఇకనైనా మేకర్స్‌కు అర్థం అవుతుందేమో చూడాలి.