నూజివీడులో తమ్ముళ్ళ పంచాయితీ..బాబు వచ్చాక తేల్చాల్సిందే.!

ఉమ్మడి కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో రచ్చ నడుస్తూనే ఉంది. నేతల మధ్య పంచాయితీ కొనసాగుతూనే ఉంది. మరో రెండు రోజుల్లో అధినేత చంద్రబాబు నూజివీడులో పర్యటించనున్నారు. ఈ క్రమంలో కూడా అక్కడ పంచాయితీ కొనసాగుతూనే ఉంది. ఇంచార్జ్ ముద్దరబోయిన వెంకటేశ్వరరావు, కొందరు నేతల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి.

ఈ నెల 12న బాబు పర్యటనని దృష్టిలో పెట్టుకుని ముద్దరబోయిన, ఏలూరు పార్లమెంట్ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు ఏర్పాట్లు చూస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నేతలు, కార్యకర్తలతో సమావేశం అవుతున్నారు. అయితే ఈ సమావేశాలకు చాట్రాయి, ఆగిరిపల్లి మండలం నేతలు హాజరు కాలేదు. కీలక నేత కాపా శ్రీనివాసరావు హాజరవ్వలేదు. వీరు సెపరేట్ గా సమావేశం పెట్టుకున్నారు. ముద్దరబోయిన వెంకటేశ్వరరావు పట్ల అసంతృప్తితో ఉన్న ఈ నాయకులు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని కలసి ఆయన వ్యవహార శైలిపై ఫిర్యాదు చేశారు.

ఇక ఈ విషయాన్ని అచ్చెన్నాయుడు చంద్రబాబుకు ఫోన్‌ ద్వారా సమాచారం ఇవ్వడంతో ఆయన అందరూ కలసి పనిచేయకుండా ఏమిటీ ఈ పంచాయితీలు అని అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. అయితే బాబు పర్యటన ఏర్పాట్లు బాధ్యత ముద్దరబోయినకే అప్పగించారు. అయితే ఈ సీటుపై ఎప్పటినుంచో రచ్చ ఉంది. ఇక్కడ కొందరు కమ్మ నేతలు..ముద్దరబోయినకు సహకరించడం లేదు.

దీంతో టి‌డి‌పి వరుసగా రెండు సార్లు ఓడిపోతూ వచ్చింది. ఇప్పటికీ అదే పరిస్తితి. అలాగే సీటు కోసం పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో బాబు ఈ సీటు విషయం తెలిస్తే బెటర్ అని చెప్పవచ్చు..లేదంటే రచ్చ ఇలాగే జరుగుతూ ఉంటుంది.