ఈ మధ్య టీడీపీలో ఎన్‌ఆర్‌ఐల హవా ఎక్కువైంది. సడన్ గా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి..చాలా చోట్ల సీట్ల కోసం ట్రై చేయడం మొదలుపెట్టారు. దీంతో పలు నియోజకవర్గాల్లో టీడీపీ క్యాడర్‌లో కన్ఫ్యూజన్ ఉంది. ఉదాహరణకు ఉమ్మడి కృష్ణా జిల్లా గుడివాడ టీడీపీ ఇంచార్జ్ గా రావి వెంకటేశ్వరరావు ఉన్నారు..కానీ అక్కడ్ ఆయనకు పోటీగా ఎన్‌ఆర్‌ఐ వెనిగండ్ల రాము ఎంట్రీ ఇచ్చారు. ఆయన కూడా నియోజకవర్గంలో యాక్టివ్ గా పనిచేస్తున్నారు. ఆర్ధికంగా బలంగా ఉండటంతో సీటు కోసం కూడా ట్రై చేస్తున్నారు. దీంతో టీడీపీ క్యాడర్ కన్ఫ్యూజ్ అవుతుంది.
ఇదే క్రమంలో టీడీపీ కంచుకోటగా ఉన్న శృంగవరపుకోటలో కూడా అదే పరిస్తితి. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఉన్న ఈ ఎస్ కోటలో టీడీపీకి బలం ఎక్కువ. 1983 నుంచి 2019 వరకు కేవలం రెండు సార్లు మాత్రమే టీడీపీ ఓడింది. 2019 లో జగన్ వేవ్ లో ఓడింది. అయితే ఇప్పుడు అక్కడ వైసీపీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుపై ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. నెక్స్ట్ గాని ఆయనకు మళ్ళీ సీటు ఇస్తే గెలవడం కష్టమని సొంత పార్టీ వాళ్లే మాట్లాడుకునే పరిస్తితి.
అయితే వైసీపీలో ఉన్న పరిస్తితులని టీడీపీ వాడుకుని సత్తా చాటవచ్చు. కానీ టీడీపీలోనే క్లారిటీ లేదు. ఇక్కడ సీటు కోసం పోటీ పెరిగింది. ప్రస్తుతం ఇక్కడ ఇంచార్జ్‌గా కోళ్ళ లలితకుమారి ఉన్నారు. ఈమెకు పోటీగా ఎన్‌ఆర్‌ఐ గంప కృష్ణ పనిచేస్తున్నారు. వాస్తవానికి 2014లో లలిత టీడీపీ నుంచి గెలిచారు..2019లో ఓడిపోయారు. కాకపోతే ఓడిపోయాక చాలా రోజులు పార్టీలో యాక్టివ్ గా లేరు. దీంతో పార్టీకి ఇబ్బందికర పరిస్తితులు ఎదురయ్యాయి.
కానీ పార్టీకి ఊపు పెరుగుతున్న నేపథ్యంలో లలిత యాక్టివ్ అయ్యారు. నియోజకవర్గంలో తిరుగుతున్నారు. ఇప్పుడు దూకుడుగా పనిచేస్తున్నారు. ఈమెకు పోటీగా కృష్ణ కూడా పనిచేస్తున్నారు. స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. సొంత డబ్బులు ఖర్చు పెట్టి పనులు చేయిస్తున్నారు. ఎస్ కోట సీటు కోసం ఈయన గట్టిగా ట్రై చేస్తున్నారు. దీంతో టీడీపీలో కన్ఫ్యూజన్ మొదలైంది. దీంతో అధిష్టానం వద్ద పంచాయితీ తేల్చుకోవాలని లలిత చూస్తున్నారు. మరి ఈ సీటు విషయంలో బాబు ఎటువైపు మొగ్గుచూపుతారో చూడాలి.