వైసీపీ రాజ్య‌స‌భ అభ్య‌ర్థులు వీళ్లే.. ఊహించ‌ని ట్విస్ట్ ఇచ్చిన జ‌గ‌న్‌…!

ఏపీలో అధికార వైసీపీ రాజ్య‌స‌భ అభ్య‌ర్థులు దాదాపు ఖ‌రార‌య్యారు. ఖాళీ అవుతున్న నాలుగు స్థానాల‌ను భ‌ర్తీ చేసేందుకు నోటిఫికేష‌న్ వెలువ‌డింది. ఈ నాలుగు స్థానాలు అధికార‌ వైసీపీకి ద‌క్క‌నున్నాయి. ఈ ప‌ద‌వుల కోసం పార్టీలో చాలా పోటీ నెల‌కొంది. పార్టీ కీల‌క‌నేత విజ‌య‌సాయిరెడ్డిని మ‌ళ్లీ కొన‌సాగించ‌నున్న‌ట్టు తెలుస్తోంది.

ఈ నేప‌థ్యంలో వైసీపీ అభ్య‌ర్థుల ఎంపిక‌పై జ‌గ‌న్ తీవ్రంగా క‌స‌ర‌త్తు చేశారు. విజ‌య‌సాయిరెడ్డిని మ‌ళ్లీ కొన‌సాగించ‌నున్నార‌ని స‌మాచారం. ఇక మిగిలిన మూడు స్థానాల‌కు ప్ర‌ముఖ న్యాయ‌వాది, నిర్మాత నిరంజ‌న్‌రెడ్డి, బీసీ సంఘం జాతీయ అధ్య‌క్షుడు ఆర్‌.కృష్ణ‌య్య – మాజీ ఎమ్మెల్యే బీద మ‌స్తాన్‌రావుల‌ను ఎంపిక చేసిన‌ట్టు విశ్వ‌స‌నీయ స‌మాచారం.

అంటే రెండు బీసీల‌కు, రెండు రెడ్ల‌కు ఇస్తార‌న్న మాట‌. బీసీల‌కు ఇచ్చే రెండు ప‌ద‌వులు కూడా యాద‌వుల‌కే ద‌క్క‌నున్నాయి. ఇక బీద మ‌స్తాన్ రావు గ‌త ఎన్నిక‌ల్లో నెల్లూరు నుంచి టీడీపీ త‌ర‌పున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ త‌ర్వాత ఆయ‌న వైసీపీలో చేరారు. అప్పుడే ఆయ‌న్ను జ‌గ‌న్ రాజ్య‌స‌భ‌కు పంపుతాన‌ని హామీ ఇచ్చిన‌ట్టు స‌మాచారం.

ఇక ఆర్‌. కృష్ణ‌య్య గ‌తంలో టీడీపీ నుంచి తెలంగాణ‌లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక వీరితో పాటు కేంద్ర మాజీ మంత్రి, శ్రీ‌కాకుళం జిల్లాకు చెందిన కిల్లీ కృపారాణి పేరు కూడా ప‌రిశీలిస్తున్నార‌ట‌. ఒక వేళ బీసీ, మ‌హిళా కోటాలో ఆమెకు ఛాన్స్ ఇస్తే ఎవ‌రు త‌ప్పుకుంటారు ? అన్న‌ది చూడాలి.