నారాయణ పెత్త‌నంతో టీడీపీ కొంప కొల్లేరేనా..!

ఏపీలో మునిసిప‌ల్ శాఖ మంత్రిగా ఉన్న పొంగూరు నారాయ‌ణ త‌న జిల్లాల్లో చ‌క్రం తిప్పుతున్నార‌ట‌! ఈ కామెంట్లు గ‌త కొన్నాళ్లుగా వినిపిస్తూనే ఉన్నాయి. మునిసిప‌ల్ శాఖ‌తో పాటు రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణంలోనూ కీల‌కంగా ఉన్న సీఆర్‌డీఏకి ఉపాధ్య‌క్షుడుగా కూడా నారాయ‌ణ చ‌క్రం తిప్పుతున్న విష‌యం తెలిసిందే. దీంతో అధికారులు అంద‌రూ ఈయ‌న‌కు జీ హుజూర్ అంటున్నారు. అయితే, ఈ ప‌రిణామం ఇప్పుడు విక‌టిస్తోంద‌ని అంటున్నారు టీడీపీ త‌మ్ముళ్లు. ముఖ్యంగా నారాయ‌ణ త‌న సొంత జిల్లా నెల్లూరులో రెచ్చిపోతున్నార‌ని, త‌న సామాజిక వ‌ర్గానికి త‌ప్ప మిగిలిన వారికి విలువ ఇవ్వ‌డం లేద‌ని వీరు ఆరోపిస్తున్నారు.

నెల్లూరులో రెడ్డి సామాజిక వ‌ర్గం ఆధిప‌త్యం ఎక్కువ‌. గ‌తంలో ఆనం రెడ్డి బ్ర‌ద‌ర్స్ కాంగ్రెస్‌లో ఉండ‌గా.. దాదాపు వీరి ఆదిప‌త్య‌మే క‌నిపించింది. అయితే, ఇప్పుడు వీరు టీడీపీలోకి జంప్ చేశారు. దీంతో అప్ప‌టికే టీడీపీలో ఉన్న రెడ్డి సామాజిక వ‌ర్గం మ‌రింత బ‌ల‌ప‌డుతుంద‌ని, రాబోయే 2019లో జిల్లాలో టీడీపీ క్లీన్ స్వీప్ చేస్తుంద‌ని టీడీపీ జిల్లా నేత‌లు ప‌క్కాగా లెక్క‌లు క‌ట్టారు. అంతేకాదు, జ‌గ‌న్ పార్టీకి కంచుకోట‌గా ఉన్న ఈ జిల్లాలో టీడీపీ సైకిల్ ప‌రుగులు పెడుతుంద‌ని భావించారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. ఇప్పుడు మంత్రి నారాయ‌ణ వ్య‌వ‌హ‌రిస్తున్న శైలితో త‌మ అంచ‌నాలు త‌ల్ల‌కింద‌లు కావ‌డం ఖాయ‌మ‌ని వాళ్లు వాపోతున్నారు.

అయిన దానికీ, కానిదానికీ మంత్రి నారాయ‌ణ జిల్లా పాలిటిక్స్‌లో వేలు పెడుతున్నార‌ని టీడీపీ నేత‌లు ఆరోపిస్తున్నారు. మొన్నామ‌ధ్య మునిసిప‌ల్ క‌మిష‌న‌ర్ బ‌దిలీ విష‌యంలో త‌న ఇష్టం వ‌చ్చిన‌ట్టు వ్య‌వ‌హ‌రించార‌ని, క‌నీసం మేయ‌ర్ విన‌తిని కూడా నారాయ‌ణ ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోలేద‌ని అంటున్నారు. అంతేకాకుండా రెడ్డి సామాజిక వ‌ర్గానికి అస్స‌లు విలువ ఇవ్వ‌డంలేద‌ని, కేవ‌లం త‌న సామాజిక వ‌ర్గం బ‌లిజ‌ల‌ను నెత్తిన పెట్టుకుంటున్నార‌ని, ప్ర‌తి ప‌నికీ త‌న సిఫార్సు త‌ప్ప‌ద‌నే ధోర‌ణికి వ‌చ్చేశాడ‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలో జిల్లాలో రెడ్డి వ‌ర్గం టీడీపీకి దూర‌మ‌య్యే ప‌రిస్థితి పొంచి ఉంద‌ని వాళ్లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

మంత్రికితోడు జిల్లా పార్టీ అధ్య‌క్ష‌డు బీద ర‌విచంద్ర కూడా మంత్రికే స‌పోర్ట్ చేస్తున్నార‌ని అంటున్నారు. ఫ‌లితంగా రెడ్డి సామాజిక వ‌ర్గం త‌మ స‌మ‌స్య‌ల‌ను ఎవ‌రికి చెప్పుకోవాలో కూడా తెలియడం లేద‌ని అంటున్నారు. వాస్త‌వానికి మంత్రి ఎమ్మెల్సీ కాబ‌ట్టి ఆయ‌న‌కు ఎమ్మెల్యే ఎన్నిక‌ల బాధ‌లు తెలియ‌వ‌ని ఎద్దేవా చేస్తున్నారు. మంత్రి నారాయ‌ణ వైఖ‌రి మారాల్సిన అవ‌స‌రం ఉంద‌ని, జిల్లాలో బ‌లంగా ఉన్న రెడ్డి సామాజిక వ‌ర్గాన్ని క‌లుపుకొని పోక‌పోతే.. టీడీపీ కొంప మున‌గ‌డం ఖాయ‌మ‌ని వాళ్లు టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్‌కి చెప్పిన‌ట్టు తెలిసింది. మ‌రి ఈ విష‌యంలో లోకేష్ ఏం చేస్తాడో చూడాలి.