పాన్ ఇండియన్ రెబల్ స్టార్‌గా ప్రభాస్ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. కాగా ఎంత పెద్ద స్టార్ హీరో అయినా.. సినీ కెరీర్లో సూపర్ హిట్లు, డిజాస్టర్లు, ప్లాప్‌లు కామన్. అలాగే ప్రభాస్ కెరీర్లోను కొన్ని సినిమాలు ఉన్నాయి. వాటిలో ఏక్ నిరంజన్ సినిమా కూడా ఒకటి. అప్పట్లో పూరి జగన్నాథ్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా విపరీతమైన అంచనాల నడుమ రిలీజై ఫ్లాప్‌గా నిలిచింది. గతంలో వీరిద్దరి కాంబోలో బుజ్జిగాడు మేడిన్ చెన్నై.. సినిమా తెరకెక్కి కమర్షియల్ గా మంచి సక్సెస్ అందుకుంది. ఈ సినిమా అప్పట్లో యూత్ నీ బాగా ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమా కావడం అలాగే సినిమా సాంగ్స్ ముందే రిలీజై మంచి సక్సెస్ అందుకోవడంతో ఏక్ నిరంజన్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
అయితే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత కమర్షియల్ గా పెద్ద ఫ్లాప్ గా నిలిచింది. దీంతో సినిమా ప్రొడ్యూసర్ అయిన ఆదిత్య రామ్ నష్టాలుచెవి చూశాడు. అప్పటినుంచి సినిమాలను చేయడమే మానేసిన ఆయన.. తాజాగా రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాతో ప్రొడ్యూసర్‌గా రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాకు సంబంధించి తమిళ్ వెర్షన్ థియేటర్ హక్కులను ఆదిత్య రామ్ కొనుగోలు చేశారు. ఇక తాజాగా దిల్ రాజుతొ కలిసి ఆదిత్య రామ్ చెన్నైలో ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశాడు. ఇందులో స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించిన ఆదిత్య రామ్ మాట్లాడుతూ.. నేను మీ అందరికీ గుర్తున్నానో లేదో.. గతంలో ప్రభాస్ ఏక్ నిరంజన్ సినిమాకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించా.
ఈ మూవీ తర్వాత సినీ ఇండస్ట్రీని వదిలి రియల్ ఎస్టేట్‌లోకి వెళ్లాను. ఎందుకంటే అప్పట్లో రియల్ ఎస్టేట్‌లో ఎక్కువ లాభాలు ఉన్నాయి. మళ్లీ ఇన్నాళ్లకు గేమ్ ఛేంజర్‌తో రీ ఎంట్రీ ఇస్తున్నా. కచ్చితంగా ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకొని సక్సెస్ ట్రాక్ లోకి వెళ్తానని నమ్మకం నాకు ఉందంటూ చెప్పుకొచ్చాడు. ఈ సినిమా సక్సెస్ వస్తే మళ్ళీ నేను ఇంకొన్ని సినిమాలు కొంటా అంటూ వెల్లడించాడు. ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్స్ నెటింట వైరల్‌గా మారడంతో ప్రభాస్ యాంటీ ఫ్యాన్స్ ఆదిత్య రామ్ మాట్లాడిన మాటలను నెగిటివ్ చేస్తూ ఓ రేంజ్ లో ట్రోల్స్ చేస్తున్నారు. ప్రభాస్ సినిమాతో నష్టపోయా.. చరణ్ ఇప్పుడు నన్ను కాపాడాలి అంటూ ఆయన కామెంట్స్ చేశారంటూ తెగ ట్రెండ్ చేస్తున్నారు.