టాలీవుడ్ క్రేజీ హీరో నిఖిల్.. సుధీర్ వర్మ డైరెక్షన్‌లో తెరకెక్కిన తాజా మూవీ ‘ అప్పుడో ఇప్పుడో ఎప్పుడో ‘. గతంలో వీరిద్దరి కాంబోలో స్వామి రారా, కేశవ మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తెరకెక్కిన ఈ సినిమా మాత్రం టైటిల్ కు తగ్గట్టుగానే ఎప్పుడు షూట్ చేశారో.. ఎప్పుడు సినిమా పనులు పూర్తి చేసారో కూడా తెలియక ముందే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేసారు. కార్తికేయ 2 లాంటి బ్లాక్బస్టర్ కొట్టిన నిఖిల్ నెక్స్ట్ సినిమాగా వచ్చిన ఈ సినిమాకు.. కనీసం అంచనాలు లేకుండా, ప్రమోషన్స్ ఏవి జరపకుండా మేకర్స్ రిలీజ్ చేశారు. సినిమా ఆడియన్స్‌ను మెప్పించిందా.. లేదా.. రిజల్ట్ ఏంటో ఒకసారి చూద్దాం.
కథ
హైదరాబాదులో సరదాగా తిరిగే ఒక కుర్రాడు రిషి (నిఖిల్) లవ్ ఫెయిల్యూర్‌గా లండన్‌కు వెళ్ళిపోతాడు. కెరీర్ కోసం అక్కడ రేస్ డ్రైవ్ గా ట్రైనింగ్ తీసుకుంటూ.. పాకెట్ మనీ కోసం చిన్న చిన్న పనులు చేస్తూ బిజీగా ఉంటాడు. ఈ క్రమంలో లండన్ లో పరిచయమైన తులసి (దివ్యంకా కౌశిక్) తో ప్రేమలో పడతాడు. పెళ్లి చేసుకుందామని సమయానికి తులసి మిస్ అవ్వడం.. హైదరాబాద్‌లో ప్రేమించిన తార (రుక్మిణి వసంత్) లండన్ లో మళ్ళీ ప్రత్యక్షమవడంతో.. జీవితంపై సరికొత్త ఆశలు చిగురిస్తాయి. అలాంటి క్రమంలో అనుకోని సంఘటనలతో రిషి.. లోకల్ డాన్ బద్రీనాథ్ (జాన్ విజయ్) చేతిలో చిక్కుకుంటాడు. అసలు ఈ బద్రి నారాయణ ఎవరు.. రిషికి ఆయనకు ఏంటి కనెక్షన్.. రిషి అతడి నుంచి ఎలా తప్పించుకున్నాడు.. కథలో తార, తులసి ఎలాంటి పాత్ర ప్లే చేవవారో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ
చాలా సందర్భాల్లో సినిమాలు రిలీజ్ అవ్వాల్సిన టైం కంటే ముందే రావడంతో ఫెయిల్ అయిన ఘటనలు ఉన్నాయి. ఆ సినిమా ఇప్పుడు రిలీజ్ అయితే ఆడియన్స్ వేరేలా రిసీవ్ చేసుకునేవారు. కానీ.. కొన్ని సినిమాలు ట్రెండ్‌తో సంబంధం లేకుండా ముందుగా లేదా.. లేటుగా రిలీజ్ అవుతూ ఉంటాయి. అలాంటి వాటిలో అప్పుడో ఇప్పుడే ఎప్పుడో సినిమా కూడా ఒకటి. నిఖిల్ ఈ సినిమాను ఎప్పుడో నటించాడని లుక్స్ చూస్తే ఈజీగా అర్థమవుతుంది. కంటెంట్ కూడా బోరింగ్ అనిపించింది. కమర్షియల్టి కూడా తక్కువగా ఉండటం.. ముఖ్యంగా యాక్షన్ బ్లాక్ డిజైన్ చేసిన తీరు అసలు మెప్పించలేకపోవడంతో.. సినిమా వర్కౌట్ కాలేదని అనిపిస్తుంది.
నటీనటుల పర్ఫామెన్స్
నిఖిల్ తన లుక్స్ టైమింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అయితే క్యారక్టరైజేషన్ డెవలప్మెంట్ లో క్లారిటీ లేదు. దీంతో రిషి పాత్ర ఆడియన్స్‌కు కనెక్ట్ కావడం కష్టమే. రుక్మిణి వసంత్ నాచురల్ బ్యూటీగా ఎంతో ఆకట్టుకునేది. కానీ.. మేకప్ లుక్ ఆమెకు సరిగ్గా సెట్ అయినట్లు అనిపించలేదు. అయితే ఎక్స్ప్రెషన్స్ విషయంలో మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తులసిలా.. దివ్యంకా కౌశిక్ పాత్ర నెగటివ్ క్యారెక్టర్ కావడంతో లుక్స్, గ్లామర్ పరంగా ఎంటర్టైన్ అవుతారు. ఇక హర్ష కామెడీ టైమింగ్ బాగుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ ప్రేక్షకులను కడుపుబ్బా నవిస్తాయి. జాన్ విజయ్ అండ్ అజయ్ యావరేజ్ అనిపించుకుంటే.. సత్యదేవ్, సుదర్శన్ సినిమాకు కాస్త స్పీడ్ ను పెంచారు.
టెక్నికల్ గా
టెక్నికల్ పరంగా సుదీర్ వర్మ తన మార్క్ చూపించాడు. కెమెరా వర్క్, లైటింగ్, మ్యూజిక్ ఇలా ప్రతిదానిలోనూ ఆయన ఎఫర్ట్స్ కనబడతాయి. ముఖ్యంగా.. కథను మూడో వ్యక్తి కోణంలో చూపించడం సినిమాకు హైలెట్. కానీ.. కథలో కీలకమైన మలుపులు రివీల్ చేయడంలో తడబడ్డాడు. కీలక సన్నివేశాలు ప్రేక్షకులు ఆకట్టుకునేలా డిజైన్ చేయకపోవడంతో.. ఆడియన్స్‌ను మెప్పించలేకపోయాడు. ఇక సినిమాటోగ్రఫీ, పాటలు సోసోగా అనిపించాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ఎలివేషన్స్ కూడా సరిపోలేదనిపించింది.
రేటింగ్:2/5