పాపులారిటీకి ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ ఇవి అంటూ ఈడీ విచారణపై విజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు..

లైగర్‌ సినిమాలో పెట్టిన పెట్టుబడుల వ్యవహారంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ నిర్మాణంలో నిధుల మళ్లింపు జరిగిందనే అనుమానంతో అధికారులు పూరి జగన్నాథ్, ఛార్మిలతో పాటు తాజాగా విజయ్ దేవరకొండను కూడా ప్రశ్నించారు. రౌడీ బాయ్ విజయ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బుధవారం 12 గంటల పాటు లైగర్ మూవీ కోసం పెట్టుబడి పెట్టడంపై ప్రశ్నించింది.

ప్రశ్నోత్తరాల సమయం అయిపోగానే విజయ్ ఈడీ ఆఫీస్ ఎదుట నిల్చని మీడియాతో మాట్లాడాడు. “పాపులారిటీ వచ్చాక కొన్ని ఇబ్బందులు, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అందులో ఇప్పుడు జరిగిందొకటి. ఇదే లైఫ్. నేను అధికారులు పిలిచినప్పుడు వెళ్లాను. ప్రశ్నలకు సమాధానమిచ్చాను. వారు నన్ను మళ్లీ రమ్మని పిలవలేదు.” అని విజయ్ చెప్పుకొచ్చాడు. లైగర్ సినిమాలో కొందరు పొలిటిషన్లు మనీ ఇన్వెస్ట్ చేశారని.. హవాలా ద్వారా మనీని దుబాయ్‌కి చేర్చి అక్కడి నుంచి ఇన్‌వెస్ట్ చేశారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల ప్రైమరీ ఇన్వెస్టిగేషన్‌లో తేలింది. తర్వాత ఈ సినిమాలో కీలకమైన వారందరినీ ప్రశ్నించడం జరుగుతుంది.

ఈడీ అధికారులు విజయ్‌ ప్రశ్నించిన సమయంలో.. మూవీలో ఎవరెవరు ఎంత డబ్బులు ఇన్వెస్ట్ చేశారు? కాస్ట్ అండ్ క్రూకి ఎంత పారితోషికం ఇచ్చారు? సినిమా కోసం మీరెంత తీసుకున్నారు? మూవీ రాబట్టిన కలెక్షన్ ఎంత? విదేశాల్లో ఎంత డబ్బుకు థియేటర్ హక్కులను అమ్ముకున్నారు? వంటివి అడిగినట్లు సమాచారం. అలానే ఈ సినిమాలో మాజీ హెవీ వెయిట్‌ బాక్సింగ్‌ ఛాంపియన్‌ మైక్‌ టైసన్‌ తీసుకున్న పారితోషికం ఎంత అని కూడా అడిగినట్లు తెలుస్తోంది. విజయ్ తన మేనేజర్‌తో కలిసి ఉదయం 11 గంటలకు ఈడీ ఆఫీస్‌కి వెళ్తే రాత్రి 8 గంటల వరకు ప్రశ్నలకు సమాధానాలు చెప్పాడు.