తొలి అవ‌కాశం కోసం కైకాల క‌ష్టాలు.. చేతిదాకా వ‌చ్చి చేజారిపోయిన సినిమాలు ఎన్నంటే?

టాలీవుడ్ దిగ్గ‌జ న‌టుడు, నవరస నట సార్వభౌమ కైకాల సత్యనారాయణ తిరిగిరాని లోకాల‌కు వెళ్లిపోయారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపుతున్న ఆయ‌న నేటి తెల్ల‌వారుజామున క‌న్నుమూశారు. 87ఏళ్ల కైకాల అర‌వై ఏళ్ల సినీ జీవితాన్ని అనుభవించారు. ఇన్నేళ్ల కెరీర్ లో దాదాపు ఎనిమిది వంద‌ల చిత్రాల్లో న‌టించారు. హీరోగా ఎంట్రీ ఇచ్చినా.. ఆ త‌ర్వాత విల‌న్ గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా ర‌క‌ర‌కాల పాత్ర‌లు పోషించి ప్రేక్ష‌కుల‌ను మెప్పించారు.

కృష్ణా జిల్లాలోని కౌతవరంలో జ‌న్మించిన కైక‌ల కాలేజీ రోజుల్లో నాటకాలపై ఆసక్తి పెంచుకున్నారు. నటుడు కావాలని కలలు కన్నారు. ఆ మ‌క్కువ‌తోనే ఎన్నో నాట‌కాల్లో న‌టించారు. ఇంట‌ర్‌లో ఉండ‌గా ఇండస్ట్రీ నుంచి ఆయనకు ఆహ్వానాలు వ‌చ్చినా.. డిగ్రీ పూర్తి చేసిన తర్వాతే సినిమా ఛాన్సుల కోసం ప్రయత్నించారు. ఆ స‌మ‌యంలో కైకాల ఎన్నో క‌ష్టాలు ప‌డ్డారు. చేతిదాకా చేజారిన సినిమాలు ఉన్నాయి. ఆయనకు వచ్చిన తొలి ఛాన్స్ `కొడుకులు – కోడళ్లు`. అది ఎల్.వి. ప్రసాద్ తీయాలన్న సినిమా. ఈ సినిమా ఆడిషన్స్ లో కైకాల పాల్గొన్నారు.

నాట‌కాలు వేసిన అనుభవం ఉండటంతో అవలీలగా నటించేశారు. స్క్రీన్ టెస్ట్‌లు చేసి ఎల్.వి. ప్రసాద్ ఓకే చేశారు. కానీ, ఈ సినిమా స్టార్ట్ కాలేదు. ఆ తర్వాత కె.వి. రెడ్డి దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు హీరోగా నటించిన `దొంగ రాముడు`లో విలన్ రోల్ చేసే ఛాన్స్ వచ్చింది. ఆడిషన్స్, స్క్రీన్ టెస్ట్‌లు చేసి ఓకే అనుకున్నారు. చివరకు, ఆ రోల్ ఆర్. నాగేశ్వరరావుకు దక్కింది. ఆ సమయంలో కైకాల కుంగిపోలేదు. పట్టు వదలని విక్రమార్కుడిలా ముందుకు సాగారు. అలా `సిపాయి కూతురు` మూవీతో హీరోగా ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టారు. ఇదే కైక‌ల తొలి చిత్రం. ఈ సినిమా మంచి విజ‌యం సాధించ‌లేదు. కానీ, ఆ త‌ర్వాత వ‌చ్చిన అవ‌కాశాల‌ను స‌ద్వినియోగం చేసుకుంటూ కైక‌ల ఇండ‌స్ట్రీలో అంచ‌లంచలుగా ఎదిగారు. ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. ప్రేక్ష‌కుల మ‌న‌సుల్లో చెరిగిపోని ముద్ర‌ను వేసుకున్నారు.