నవరస నట సార్వభౌమ కైకాల ఆఖ‌రి చిత్రం ఏదో తెలుసా?

హీరోగా, విలన్ గా, సహాయక నటుడుగా విలక్షణమైన పాత్రలు పోషించి నవరస నట సార్వభౌమగా గుర్తింపు పొందిన కైకాల సత్యనారాయణ ఇక లేరు. గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఫిలింనగర్ లోని తన నివాసంలో నేటి తెల్లవారుజామున 4 గంటలకు తుది శ్వాస విడిచారు. ఆయన మరణ వార్త టాలీవుడ్ ను తీవ్ర విషాదంలోకి నెట్టేసింది.

ఐదు తరాల హీరోలతో సినిమాలు చేసిన కైకాల.. ఆరు దశాబ్దాల పాటు ఇండస్ట్రీలో తన కెరీర్ ను సక్సెస్ ఫుల్ గా సాగించారు. 800 పైగా చిత్రాల్లో నటించిన కైకాల చివరిగా ఏ సినిమా చేశారో తెలుసా.. `మహర్షి`. అవును కైకాల నటించిన ఆఖరి చిత్రం ఇది. టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, పూజా హెగ్డే జంటగా న‌టించిన ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వ‌హించాడు.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతి మూవీస్, పివిపి సినిమా బ్యానర్లపై నిర్మితమైన ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు. 2019 విడుద‌లైన ఈ చిత్రం సూప‌ర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో పూజా హెగ్డే తాతయ్యగా అతిథి పాత్రలో కైకాల తలుక్కుమన్నారు. అంతకు ముందు ఎన్టీఆర్ బయోపిక్ `యన్.టి.ఆర్ – కథానాయకుడు`లో దర్శకుడు హెచ్.యమ్. రెడ్డి పాత్రలో మెరిశారు. నటుడిగా ఆయన పూర్తిస్థాయిలో కనిపించిన చివరి సినిమా `అరుంధతి` అనే చెప్పాలి.