బాబు-పవన్ కాంబో..తమ్ముళ్ళల్లో టెన్షన్..!

మొత్తానికి చంద్రబాబు-పవన్ కలిశారు..ఇంతకాలం చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలకు చుక్కలు చూపించిన వైసీపీ..ఇటీవల విశాఖలో పవన్, జనసేన శ్రేణులని గట్టిగానే టార్గెట్ చేసింది. ఇప్పటికే ఎంతమంది టీడీపీ నేతలపై కేసులు పెట్టారో..ఎంతమందిని జైల్లో పెట్టారు లెక్కలేదు. తాజాగా జనసేన వంతు వచ్చింది. అలాగే పవన్‌ని జనవాణి కార్యక్రమం నిర్వహించకుండా అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పవన్‌కు చంద్రబాబుతో పాటు ఇతర నేతలు సంఘీభావం తెలిపారు. ఫోన్‌లో కూడా మాట్లాడారు.

అయితే తాజాగా చంద్రబాబు ఓ అడుగు ముందుకేసి..విజయవాడలో నోవాటెల్ హోటల్‌లో ఉన్న పవన్‌ని వెళ్ళి నేరుగా కలిసి సంఘీభావం తెలిపారు. పేరుకు సంఘీభావం గాని..వెనుక మాత్రం వైసీపీని ఢీకొట్టడానికి చంద్రబాబు-పవన్ కలిసి ప్రిపేర్ అవుతున్నారని అందరికీ అర్ధమైంది. అలాగే వీరిద్దరు కలవకూడదని ప్రయత్నించిన వైసీపీ నేతలకు కూడా అర్ధమైంది. ఇక వారి ప్రెస్ మీట్ మాత్రం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కలిసి పోరాటాలు చేస్తామని ప్రకటించారు. కానీ పొత్తుల గురించి క్లారిటీ ఇవ్వలేదు.

ఇప్పుడు పోరాటాలు చేసి ఎన్నికల ముందు ఖచ్చితంగా పొత్తుతోనే ముందుకెళ్తారని చెప్పొచ్చు. ఎందుకంటే పొత్తు లేకపోతే టీడీపీ-జనసేనల మధ్య ఓట్లు చీలిపోయి అనూహ్యంగా వైసీపీకి లబ్ది జరుగుతుంది. గత ఎన్నికల్లో అదే జరిగింది. ఇప్పుడు అదే జరిగే ఛాన్స్ ఉంది. అందుకే ఆ రెండు పార్టీల కలయిక అవసరం ఉంది. మొత్తానికి ఇద్దరు కలుస్తారని దాదాపు క్లారిటీ వచ్చేసింది. బాబు-పవన్ కలవడం వల్ల కొందరు వైసీపీ నేతలకు టెన్షన్ తప్పదు. అదే సమయంలో కొందరు టీడీపీ నేతలకు టెన్షన్ ఉంది.

ఎందుకంటే పొత్తు ఉంటే కొన్ని సీట్లు జనసేనకు వదలాలి. అలా జనసేనకు సీట్లు కేటాయిస్తే కొందరు తమ్ముళ్ళు త్యాగం చేయాలి. మరి అలాంటప్పుడు ఏ నాయకుడు త్యాగం చేయాల్సి వస్తుందో అని టెన్షన్ పడుతున్నారు. ముఖ్యంగా విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనే తెలుగు తమ్ముళ్లే ఎక్కువ త్యాగం చేయాలి.