దర్శి టీడీపీ సీటు ‘వైసీపీ’ నేతకే..?

అదేంటి దర్శి టీడీపీ సీటు వైసీపీ నేతకు ఇవ్వడం ఏంటి? అసలు టీడీపీలో చాలామంది నాయకులు ఉండగా…వైసీపీ నేతకు సీటు ఎందుకు..అయినా వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చే నేత ఎవరు..అసలు ఆ కథ ఏంటి? అనేది ఒకసారి చూద్దాం. 2014 నుంచి దర్శిలో రాజకీయాలు గురించి మాట్లాడుకుంటే..2014లో టీడీపీ నుంచి శిద్ధా రాఘవరావు గెలిచి..బాబు క్యాబినెట్‌లో మంత్రి అయ్యారు. కానీ 2019 ఎన్నికల్లో ఈయనని దర్శి నుంచి కాకుండా..ఒంగోలు ఎంపీగా బరిలో దింపారు. దర్శి సీటులో..అప్పటివరకు కనిగిరి ఎమ్మెల్యేగా ఉన్న కదిరి బాబూరావుని పోటీకి దింపారు.

జగన్ గాలిలో ఇద్దరూ ఓడిపోయారు. పైగా వైసీపీ అధికారంలోకి వచ్చాక ఒకరితర్వాత ఒకరు వైసీపీలోకి వెళ్ళిపోయారు. శిద్ధా తన తనయుడు సుధీర్‌తో కలిసి వైసీపీలోకి జంప్ కొట్టారు. అటు కదిరి కూడా వైసీపీలోకి వెళ్లారు. దీంతో దర్శిలో టీడీపీకి ఇబ్బందికర పరిస్తితులు వచ్చాయి. ఈ క్రమంలో పమిడి రమేశ్‌ని ఇంచార్జ్ గా పెట్టారు. రమేశ్ వచ్చాక నియోజకవర్గంలో పార్టీ పరిస్తితి కాస్త మెరుగైంది.

అలాగే జిల్లా నేతల అండ, వైసీపీలో ఉన్న అంతర్గత విభేదాలని ఉపయోగించుకుని టీడీపీ దర్శి మున్సిపాలిటీలో విజయం సాధించింది. దీంతో దర్శిలో టీడీపీకి కొత్త ఊపు వచ్చింది. ఇదే తరుణంలో తనకు అధిష్టాన సహకారం లేదని చెప్పి దర్శి ఇంచార్జ్ పదవికి రమేశ్ రాజీనామా చేశారు. అంటే ఆయనకు సీటు ఇవ్వడం లేదని పరోక్షంగా తేలిపోయింది. ఇదే క్రమంలో దుబాయికి చెందిన సుబ్బారావుకి సీటు ఇస్తున్నారని ప్రచారం జరిగింది. కానీ అందులో కూడా వాస్తవం లేదని తేలింది.

అయితే ఇటీవల మరొక చర్చ నడుస్తుంది..వైసీపీ నుంచి వచ్చే ఓ కీలక నేతకు సీటు ఇస్తారని ప్రచారం మొదలైంది. దర్శి టీడీపీలోనే ఈ రకమైన చర్చ నడుస్తోంది. ఇక ఇక్కడ వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చి పోటీ చేసే నేతలు ఎవరు అనే చర్చ నడుస్తోంది. ఎలాగో టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్ళిన అక్కడ శిద్ధాకు గాని, కదిరికు గాని పెద్ద ప్రాధాన్యత దక్కలేదు. వారిలో ఎవరోకరు టీడీపీలోకి పోటీ చేస్తున్నారా? డౌట్ ఉంది. ముఖ్యంగా శిద్ధాకే ఆ ఛాన్స్ ఉందనే విధంగా మాట్లాడుకుంటున్నారు. చూడాలి మరి వైసీపీ నుంచి టీడీపీ తరుపున పోటీ చేసే నేత ఎవరో.

Share post:

Latest