ఒకే జిల్లాలో ఇద్ద‌రు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలోకి..!

ఈ హెడ్డింగే చాలా షాకింగ్‌గా ఉన్న‌ట్టు క‌నిపిస్తోందా ? ఒకే జిల్లా నుంచి ఇద్ద‌రు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలోకి జంప్ చేయ‌డ‌మా ? ఇది నిజ‌మేనా ? అన్న అనుమానాలు చాలా మందిలో రేకెత్తుతాయి. అయితే ఆ జిల్లాలో జ‌రుగుతోన్న రాజ‌కీయ ప‌రిణామాలు మాత్రం అధికార పార్టీకి చెందిన ఇద్ద‌రు ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నార‌న్న సంకేతాలే ఇస్తున్నాయి. ఆ జిల్లా రాజ‌ధాని కేంద్రంగా ఉన్న గుంటూరు జిల్లా కాగా….ఆ ఇద్ద‌రు ఎమ్మెల్యేలు ఒకరు మాజీ మంత్రి, ప్ర‌త్తిపాడు ఎమ్మెల్యే రావెల కిషోర్‌బాబు, మ‌రొక‌రు గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి.

గ‌త ఎన్నిక‌ల‌కు ముందు ఐఆర్ఎస్ అధికారిగా ఉన్న రావెల అనూహ్యంగా ప్ర‌త్తిపాడు సీటు ద‌క్కించుకుని ఎమ్మెల్యేగా గెల‌వ‌డంతో పాటు మంత్రి కూడా అయ్యారు. మంత్రి అయిన‌ప్ప‌టి నుంచి ఆయ‌న వ్య‌వ‌హార శైలీ పూర్తిగా మారిపోయింది. కార్య‌క‌ర్త‌ల‌ను పూర్తిగా విస్మ‌రించ‌డం, పార్టీ కోసం ఎప్పటి నుంచో క‌ష్ట‌ప‌డిన వారిని ప‌క్క‌న పెట్టేయ‌డం. తాను మంత్రిని అన్న విష‌యాన్ని మ‌ర్చిన ఆయ‌న ఇంకా ఆఫీస‌ర్‌లాగానే బిహేవ్ చేయ‌డం చేస్తున్నారు.

ఇక రావెల ఇద్ద‌రు కుమారులు మ‌హిళ‌ల విష‌యంలో దారుణంగా వ్యవ‌హ‌రించ‌డం, బీజేపీతో పొత్తు విష‌యంలో నెగిటివ్‌గా రియాక్ట్ అవ్వ‌డం…ఇలా ఒక‌టేమిటి చంద్ర‌బాబు ఎన్నోసార్లు ఆయ‌న‌కు వార్నింగ్ ఇచ్చినా ఆయ‌న తీరు మాత్రం మార‌లేదు. ఇక మంత్రిగా ఉన్న టైంలోనే ఆయ‌న బీఎస్పీ అధినేత్రి మాయావ‌తిని సైతం క‌లిసి వ‌చ్చార‌న్న ఇంటిలిజెన్స్ నివేదిక‌లు బాబు వ‌ద్ద‌కు చేరాయి. దీంతో ఆయ‌న్ను బాబు ప్ర‌క్షాళ‌న‌లో మంత్రి వ‌ర్గం నుంచి త‌ప్పించారు.

ఇక ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న రావెల ఎంఆర్పీఎస్ ఉద్యామానికి ఇన్‌డైరెక్టుగా స‌పోర్ట్ చేస్తున్నార‌న్న నివేదిక‌లు బాబు వ‌ద్ద‌కు వెళ్లిపోయాయి. అలాగే కొద్ది రోజుల క్రితం ఆయ‌న ఒంగోలు ఎంపీ వైవి.సుబ్బారెడ్డిని క‌లిసి న‌ట్టు టాక్‌. వ‌చ్చే ఎన్నిక‌ల్లో రావెల‌కు ఎమ్మెల్యే సీటు కూడా రాద‌ని క‌న్‌ఫార్మ్ చేసుకున్న ఆయ‌న వైసీపీలోకి జంప్ చేసి ప్ర‌త్తిపాడు నుంచి పోటీ చేసేందుకే సుబ్బారెడ్డిని క‌లిసిన‌ట్టు స‌మాచారం.

ఇక గ‌త ఎన్నిక‌ల‌కు ముందు న‌ర‌సారావుపేట ఎంపీగా ఉన్న మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి రాయ‌పాటి కోసం త‌న ఎంపీ సీటును వ‌దులుకుని గుంటూరు వెస్ట్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌ని ఆయ‌న ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు. చివ‌ర‌కు ప్ర‌క్షాళ‌న‌లోను బాబు ఆయ‌న్ను ప‌క్క‌న పెట్టేశారు. ఇటీవ‌ల మోదుగుల ప‌దే ప‌దే చంద్ర‌బాబు, టీడీపీ ప్ర‌భుత్వాన్ని టార్గెట్‌గా చేసుకుని విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

చివ‌ర‌కు మోదుగుల సొంత నియోజ‌క‌వ‌ర్గంలోనే ఆయ‌న మాట చెల్లుబాటు కావ‌డం లేదు. ఇక ఆయ‌న బావ ఆళ్ల ఆయోధ్య రామిరెడ్డి న‌రసారావుపేట నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న స‌హ‌కారంతో మోదుగుల కూడా వైసీపీలోకి వెళ్లిపోవాల‌ని ప్ర‌య‌త్నాలు చేసుకుంటున్నార‌ట. ఏదేమైనా కీల‌క‌మైన రాజ‌ధాని ఏరియాలో అధికార పార్టీకి చెందిన ఇద్ద‌రు ఎమ్మెల్యేలు విప‌క్ష వైసీపీలోకి వెళ‌తార‌ని వ‌స్తోన్న వార్త‌లు రాజ‌కీయాల‌ను ర‌స‌కందాయంలో ప‌డేశాయి.