లింగంపేట‌-మోర్తాడు మ‌ధ్య రైలు

గుర్తింపు కోరుకోని రాజ‌కీయ నాయ‌కులెవ‌రుంటారు చెప్పండి! అస‌లే పార్టీల మ‌ధ్య, నాయ‌కుల మ‌ధ్య విప‌రీత‌మైన పోటీ నెల‌కొన్న త‌రుణంలో.. ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగ‌పడే ఏ చిన్న ప‌ని చేసినా ఆ క్రెడిట్ కొట్టేయ‌డానికి నాయ‌కులు త‌హ‌త‌హ‌లాడుతుంటారు. అయితే కేసీఆర్ త‌న‌య‌, నిజామాబాద్ ఎంపీ క‌విత కూడా ఆ క్రెడిట్ కోసం ఆరాట‌ప‌డుతున్నారా? అని సందేహాలు ఇటీవ‌ల వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇదంతా ఎందుకంటే.. లింగంపేట‌- మోర్తాడు మ‌ధ్య రైలు ప్రారంభించిన క్రెడిట్ అటు బీజేపీకి ద‌క్క‌కుండా చేసేందుకు ఎంపీ అనుచ‌రులు ప్ర‌య‌త్నిస్తున్నార‌ట‌.

కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం.. టీఆర్ఎస్‌తో దోస్తీకి సిద్ధ‌మవుతోంది. అలాగే సొంతంగా పాగా వేసేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. ఈ నేప‌థ్యంలో రాష్ట్రానికి కొన్ని నిధులు, రైళ్ల‌ను మంజూరుచేస్తోంది. ఇందులో లింగంపేట‌-మోర్తాడు మ‌ధ్య రైలును కేంద్ర‌మంత్రులు సురేశ్ ప్ర‌భు, బండారు ద‌త్తాత్రేయ‌తో పాటు ఎంపీ క‌విత ఢిల్లీ నుంచి ప్రారంభించారు. ఇప్ప‌టి వ‌ర‌కూ బాగానే ఉన్నా ఇప్పుడు అస‌లు స‌మ‌స్య మొద‌లైంది. ఈ రైలును ప్రారంభించిన ఘ‌న‌త మాకు దక్కుతుందంటే.. మాకు ద‌క్కుతుంద‌ని అటు రాష్ట్ర బీజేపీ నేత‌లు, ఇటు టీఆర్ఎస్ నాయ‌కులు వాదులాడుకోవ‌డం ప్రారంభించారు.

ఈ రైల్వేలైనును ప్రారంభిస్తామ‌ని 2014 ఎన్నిక‌ల ప్ర‌చారంలో అటు టీఆర్ఎస్‌, ఇటు బీజేపీ ప్ర‌జ‌ల‌కు హామీ ఇచ్చాయి. ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీ మేర‌కు ఇప్పుడు రైల్వేలైనును ప్రారంభించామ‌ని ఎవ‌రికి వారు ప్ర‌చారం చేసుకోవ‌డం ప్రారంభించారు.

రైల్వే స్టేష‌ను వ‌ద్ద బీజేపీ నేత‌లు జై కొట్ట‌డం ప్రారంభించ‌డంతో.. వెంట‌నే ఎంపీ అనుచ‌రులు అప్ర‌మ‌త్తం అయ్యారు. ఎంపీ క‌విత‌కు జిందాబాద్ కొట్ట‌డం మొద‌లుపెట్టారు. ఇరు పార్టీల నేత‌ల హ‌డావుడిని చూసి ఆశ్చ‌ర్య‌పోవ‌డం ప్ర‌జ‌ల వంత‌యింది. దీనిపై బీజేపీ నేత‌ల నుంచి సెటైర్లు స్టార్ట్ అయ్యాయి. ఈ రైల్వే లైను తాము స్టార్ట్ చేసి ఆ క్రెడిట్ త‌మ ఖాతాలో వేసుకునేందుకు క‌విత ఆరాట ప‌డుతున్నార‌ని వారో ఆరోపిస్తున్నారు.