ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడి రేసులో వీళ్లే!

సోమువీర్రాజు.. చాలా పంతం పట్టి మరీ.. ఏపీ బీజేపీ పగ్గాలను అందింపుచ్చుకున్నారు. పార్టీ మీద అలిగి, కోపం వ్యక్తం చేసిన తర్వాత గానీ.. ఆయనకు అధ్యక్ష పీఠం దక్కలేదు. అయితే.. అంత కష్టపడి దక్కించుకున్న పార్టీ పదవికి త్వరలోనే ఎండ్ కార్డు పడబోతోంది. చీప్ లిక్కర్ వ్యవహారం ఆయన పదవికి ఎసరు పెట్టింది. ఇప్పటికే ఆయన మీద గుస్సా అయిన అధిష్ఠానం అనధికారికంగా సంజాయిషీ అడిగినట్టు తెలుస్తోంది. కాగా.. సోము వీర్రాజు పదవీకాలం సుమారుగా మరో ఆరునెలల ఉంటుంది. అయితే ఈ లోగాకూడా ఆయన పదవి పోగల అవకాశం ఉన్నదని తెలుస్తోంది.

సోమువీర్రాజు తీరుతో చాలా కాలం కిందటినుంచే విసిగిపోయి ఉన్న బీజేపీ అధిష్ఠానం.. ప్రస్తుతం కొత్త అధ్యక్షుడి అన్వేషణలో ఉన్నట్లుగా తెలుస్తోంది. సోము వీర్రాజు ద్వారా ఆయన పదవీకాలంలో రాష్ట్రంలో పార్టీకి జరిగిన నష్టం మొత్తం పూడ్చి.. పార్టీకి కాస్త వైభవ స్థితి తీసుకురాగల నాయకుడికోసం అన్వేషిస్తున్నారు.
ప్రస్తుతం రాష్ట్రబీజేపీలో సీనియర్లయిన నాయకుల్లో కేంద్రమంత్రి పురందేశ్వరి ఉన్నారు. గతంలో కూడా పార్టీ అధ్యక్షపదవి రేసులో ఆమె పేరు ప్రముఖంగా వినిపించింది. కన్నాలక్ష్మీనారాయణ తర్వాత ఆమెకే పదవి దక్కుతుందని కూడా బాగా ప్రచారం జరిగింది. కానీ.. చివరి నిమిషంలో సోము వీర్రాజు ఆ పదవిలోకి వచ్చారు.

ఈసారి కూడా పురందేశ్వరి పేరును పార్టీ ప్రధానంగా పరిశీలిస్తోంది. ఆమెతో పాటు పార్టీ సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ మాధవ్, విష్ణువర్ధన్ రెడ్డి కూడా పదవిని ఆశించే వారిలో ఉన్నారు. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని కట్టబెట్టేప్పుడు కులం కూడా కీలక భూమిక పోషిస్తుంది. రాష్ట్రంలో రెండు ప్రధాన కులాలు రెండు ప్రధాన పార్టీల పరం అయిపోయి ఉన్న నేపథ్యంలో కాపు వర్గాన్ని తమ వైపు ఆకర్షించే ప్రయత్నంలో భాగంగానే.. గతంలో కన్నాకు, ఆ తర్వాత సోముకు పదవి లభించినట్లుగా ఒక వాదన ఉంది. అదే నిజమైతే.. ఈసారి కూడా కాపు నాయకుల బీజేపీ అన్వేషించవచ్చు.ఎటూ జనసేనతో పొత్తు ఉంటుంది గనుక.. కాపు ఓట్ బ్యాంక్ దక్కే అవకాశం ఉంటే.. అది పవన్ కల్యాణ్ ద్వారా వస్తుంది గనుక.. డిఫరెంట్ స్ట్రాటజీతో వెళ్లేట్లయితే.. బీసీలకు ఎస్సీలకు పదవి కట్టబెట్టినా ఆశ్చర్యం లేదు. ఎస్సీలకు పదవి ఇవ్వదలిస్తే.. మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు పేరు ప్రధానంగా వినిపిస్తోంది. అయితే బీజేపీ అంత దూరం వెళ్లకుండా బీసీ వర్గాల నుంచి పార్టీ సారథిని నియమించాలని యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఈ సమీకరణాలు అన్నీ కాదనుకుని.. తిరిగి కాపు వర్గం నుంచే ఎంపిక చేయాలనుకుంటే.. ఇతర నాయకులతో పాటు.. మళ్లీ కన్నా లక్ష్మీనారాయణ పేరును కూడా పరిశీలించే అవకాశం ఉంది. సోము వీర్రాజు పదవి ఎటూ ఊడినట్లేనని పార్టీలో అంతా ఫిక్సయిపోయారు. కొత్త అధ్యక్ష పదవి పీఠంపై మనసున్న వారంతా.. ఇప్పటినుంచే ఎవరి ప్రయత్నాలు వారు ప్రారంభిస్తున్నట్లుగా తెలుస్తోంది.