ఏపీలో మూసేసిన సినిమా థియేటర్ల ఓపెన్..!

ఏపీ ప్రభుత్వం సినిమా థియేటర్ల యజమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. నిబంధనలు ఉల్లంఘించి మూసివేత గురైన థియేటర్లను తిరిగి తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చింది. కాగా కొద్ది రోజుల కిందట ఏపీలో ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలను తగ్గించిన సంగతి తెలిసిందే. అలాగే ఆన్ లైన్ టికెటింగ్ విధానాన్ని అమల్లోకి తెచ్చి తామే సినిమా టికెట్లను విక్రయిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ప్రభుత్వ నిర్ణయంపై సినీ ఇండస్ట్రీలో వ్యతిరేకత వ్యక్తమైంది.

తగ్గించిన టికెట్ ధరలు పెంచాలని పలువురు సినీ ప్రముఖులు నేరుగా ప్రభుత్వానికి విన్నవించారు. కాగా శ్యామ్ సింగరాయ్ విజయోత్సవ సభలో పాల్గొన్న సీనియర్ నటుడు ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ ప్రభుత్వం సీజ్ చేసిన థియేటర్లను తిరిగి ఓపెన్ చేయాలని విన్నవించాడు. ఈ నేపథ్యంలో ఆర్.నారాయణమూర్తి ఇవాళ థియేటర్ల యజమానులతో కలిసి మచిలీపట్నంలో సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానిని కలిశారు. మూసివేసిన థియేటర్లను తెరిపించాలని విన్నవించారు. అలాగే సినీ ఇండస్ట్రీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు.

ఈ నేపథ్యంలో మూసివేసిన థియేటర్లను తెరుచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీనిపై మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ మూసివేసిన థియేటర్లలో నెల రోజుల్లోగా వసతులు కల్పించుకోవాలని, అలాగే అధికారులు గుర్తించిన లోపాలను సరిదిద్దుకుని నెల రోజుల్లోగా ఆయా జిల్లాల జాయింట్ కలెక్టర్ లకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అలాగే అధికారులు థియేటర్లకు విధించిన పెనాల్టీని చెల్లించాలన్నారు.

కాగా ఇటీవల అఖండ, పుష్ప సినిమాల విడుదల సమయంలో కొందరు థియేటర్ యజమానులు నిబంధనలకు విరుద్ధంగా బెనిఫిట్ షో లు వేసారు. అలాగే కొన్ని థియేటర్లలో టికెట్ రేట్లను పెంచి విక్రయించారు. అలా నిబంధనలను ఉల్లంఘించిన పలు థియేటర్లను అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా సీజ్ చేయడం జరిగింది. కాగా ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది జిల్లాల్లో మూసివేసిన 83 థియేటర్లు తిరిగి తెరుచుకోనున్నాయి.