టీఆర్ఎస్‌లో ఎన్ని ఫైటింగ్‌లో….

తెలంగాణ అధికార పార్టీ టీఆర్ ఎస్‌లో అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు జోరందుకున్నాయి. బంగారు తెలంగాణ ఏర్పాటు ల‌క్ష్యంలో భాగంగా జిల్లాల సంఖ్య‌ను అనూహ్యంగా 31కి పెంచారు. దీంతో అప్ప‌టి వ‌ర‌కు ఉన్న 10 జిల్లాల స్థానంలో కొత్త‌గా 21 జిల్లాలు ఏర్ప‌డ్డాయి. దీంతో పాల‌న సులువు అవుతుంద‌ని, క్షేత్ర‌స్థాయిలో ప్ర‌జ‌ల‌కు పాల‌న చేరువ అవుతుంద‌ని, స‌మ‌స్య‌లు ప‌రిష్కారం అవుతాయ‌ని సీఎం కేసీఆర్ ఊహించారు. ఈ క్ర‌మంలోనే ఎన్ని అవాంత‌రాలు ఎదురైనా.. జిల్లాల ఏర్పాటులో వెన‌క్కి త‌గ్గ‌లేదు.

ఇక‌, కొత్త జిల్లాల ఏర్పాటు అనంతరం, ఆయా జిల్లాల్లోనూ అధికార పార్టీ జెండా రెప‌రెప‌లాడాల‌ని క‌సీఆర్ భావించారు. ఈ నేప‌థ్యంలో కొత్త జిల్లాల్లో పార్టీకి అధ్య‌క్షుల ఎంపిక‌ను చేప‌ట్టారు. జిల్లాల‌కు పార్టీ అధ్య‌క్షుల నియామ‌కం. పార్టీ అనుబంధ క‌మిటీల ఏర్పాటు వంటి వాటిని ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టారు. ఈ క్ర‌మంలో జిల్లా అధ్యక్షులను ఖరారు చేసే బాధ్యత తనకు వదిలేసి జిల్లా కార్యవర్గాలు, అనుబంధ సంఘాల కార్యవర్గాల జాబితాలు అందజేయాలని సీఎం కేసీఆర్ ఆయా జిల్లాల మంత్రులను ఆదేశించారు.

దీంతో రంగంలోకి దిగిన మంత్రులు తమ జిల్లాల పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో సమావేశమై కమిటీలకు జాబితాలు అందించారు. అయితే, ఇందులో కూడా నేతల మధ్య అభిప్రాయ భేదాలు, కొందరు మంత్రుల ఏకపక్ష నిర్ణయాలతో జిల్లా కమిటీల ఏర్పాటులో అనేక గంద‌ర‌గోళాలు త‌లెత్తాయి. దీంతో ఈ  పంచాయితీ సీఎం కేసీఆర్ వద్దకు చేరింద. ముఖ్యంగా భూపాలపల్లి జిల్లా అధ్యక్షుని ఎంపిక కొలిక్కి రాకపోవడం, కొత్తగూడెం అధ్యక్షుని ఎంపికలో మంత్రి తుమ్మల, ఎమ్మెల్యే జలగం వెంకట్రావుల మధ్య పోటీ ఏర్పడటం, ఖమ్మం జిల్లా అధ్యక్ష పదవికి ప్రస్తుత అధ్యక్షుడు బేగ్ అయిష్టంగా ఉన్న కారణంగా పెండింగ్‌లో పడిందంటున్నారు. జగిత్యాల జిల్లాకు అధ్యక్షునిగా దాదాపు ఖరారు చేసిన నేతపై ఫిర్యాదులు రావడంతో అదికూడా పెండింగ్‌లో పెట్టారని తెలిసింది.

మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీలు బూర నర్సయ్య గౌడ్, గుత్తా సుఖేందర్‌రెడ్డిలు తమ వారికి కమిటీల్లో స్థానం కోసం పట్టుబడుతున్నారు. ఇదే పరిస్థితి హైదరాబాద్ అధ్యక్షుని విషయంలోనూ నెలకొంది. మరో వైపు రంగారెడ్డి జిల్లా అధ్యక్షుని విషయంలోనూ ఆ జిల్లా మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేల మధ్య పోరు మొదలై సీఎం కేసీఆర్ వద్దకు పంచాయితీ చేరినట్లు చెబుతున్నారు. ఇవే కాకుండా వివిధ అంశాలను పరిశీలించి కమిటీలపై అసంతృప్తి చెలరేగకుండా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా చూసేందుకే సమయం తీసుకుంటున్నారని, మూడు రోజుల తర్వాత కమిటీలను ప్రకటించొచ్చని పార్టీ వర్గాలు చెప్పాయి.