అద్దెగర్భంపై సుష్మ సంచలన ‘వాతలు’.

కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్‌ అద్దె గర్భంపై సంచలన ‘వాతలు’ పెట్టారు కొందరు సెలబ్రిటీలకి. ఇద్దరు పిల్లలున్న సెలబ్రిటీలు కూడా తమ భార్యలకు కష్టం కలగకూడదని అద్దెగర్భం (సరోగసి)ని ఆశ్రయిస్తున్నారని ఆమె అసహనం వ్యక్తం చేయడం జరిగింది. కేంద్రం ఈ రోజు అద్దెగర్భంపై కఠిన చట్టాన్ని తెచ్చింది. కేంద్ర క్యాబినెట్‌ ఈ చట్టాన్ని ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం ఇకపై భారతదేశంలోనివారికి మాత్రమే సరోగసీ వర్తిస్తుందని, అది కూడా ఒక్కసారికి మాత్రమేనని కేంద్రం స్పష్టం చేసింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా సరోగసీ పేరుతో వ్యాపారం చేయడానికి వీల్లేదని కేంద్రం తేల్చి చెప్పడం చాలామందికి షాకింగ్‌ న్యూస్‌.

ఎందుకంటే దేశంలో సరోగసీ పేరుతో కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతోంది. గర్భధారణ నుంచి బిడ్డకు జన్మనిచ్చేదాకా ఎన్నో మధురానుభూతులు తల్లికి, తండ్రికి ఉంటాయి. గర్భాన్ని మోసేది తల్లి. ఆమెతో సమానంగా భర్త కూడా ఆ ఆనందాన్ని అనుభవిస్తాడు. ప్రసవించడం అంటే తల్లికి ఇంకో జన్మ ఎత్తడమే. కానీ అంతటి నొప్పిని కూడా ఆమె తట్టుకుంటుంది, బిడ్డకు జన్మనిస్తున్నాననే ఆనందంతో. పిల్లలు కలగనివారి విషయంలో సరోగసీ ఎంతో ఉపయుక్తమే. కానీ నొప్పి భరించలేమనే సాకుతో, అందాలు చెడిపోతాయనే అనుమానాలతో సరోగసీని ఆశ్రయించేవారికి మాత్రం కేంద్రం తెచ్చిన చట్టం చెంపపెట్టులాంటిది.