రేపు టీఆర్ఎస్ జంటనగరాల సర్వసభ్య సమావేశం..

తెలంగాణ రాష్ట్ర రాజదాని హైదరాబాదులో పార్టీని బలోపేతం చేసేందుకు అధిష్టానం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 44 సీట్లను కోల్పోయింది. బీజేపీ 48 చోట్ల గెలిచి బలం పుంజుకుంది. దీంతో తిరిగి పార్టీకి జవసత్వాలు అందించేందుకు టీఆర్ఎస్ నాయకత్వం చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే మంగళవారం జంటనగరాల సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు సీనియర్లు. పీవీ నర్సింహరావు మార్గ్ లోని జలవిహార్ లో సమావేశం నిర్వహిస్తున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నువ్వా.. నేనా అన్నట్లు జరిగిన పోటీలో టీఆర్ఎస్ పార్టీ సిటీలో గులాబీ జెండా ఎగురవేసినా బీజేపీకి అత్యధిక స్థానాలు రావడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీసిందని నాయకులు భావిస్తున్నారు. పార్టీ అధినేత కూడా ఇదే ఆలోచనలో ఉన్నాడు. నగరంలో పార్టీని మంత్రులు తలసాని, మల్లారెడ్డి, సబిత ఇంద్రారెడ్డి నడిపిస్తున్నారు. కేటీఆర్ వారికి సలహాలు, సూచనలు ఇస్తుంటారు. అయితే ప్రత్యేకంగా సిటీలో పార్టీ సమావేశాలు నిర్వహించడం అనేది ఇటీవల కాలంలో జరగలేదు. అధికారిక కార్యక్రమాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు మాత్రం పాల్గొంటున్నారు.

ఎక్కడ చూసినా సమస్యలు.. అదే టీఆర్ఎస్ మైనస్

పార్టీ అధికారం చేపట్టి ఏడు సంవత్సరాలైన నగరంలో పరిస్థితి మాత్రం పెద్దగా మార్పు రాలేదు. ఫ్లై ఓవర్లు, మెట్రో రైల్ వచ్చినా బస్తీలు, కాలనీల్లో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. దీంతో నాయకులు అక్కడ ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నారు. ముఖ్యంగా రోడ్ల పరిస్థితి టీఆర్ఎస్ గ్రాఫ్ ను కిందికి తీసుకెళుతున్నాయి. విశ్వనగరం అని చెప్పుకుంటూ .. కనీసం రోడ్లపై గుంతలను కూడా పూడ్చకపోతే జనం ముందు ఎలా నిలబడాలి? వచ్చే ఎన్నికల్లో ఎలా ఓట్లడగాలని కార్యకర్తలు నాయకులను నిలదీస్తున్నారు. ఈ నేపథ్యంలో రేపు జరిగే సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.