ముందస్తుపైనే చర్చ..జగన్ ఫిక్స్ అవుతున్నారా?

ఏపీలో ముందస్తు ఎన్నికలపై చర్చ జరుగుతూనే ఉంది. అధికార వైసీపీ తీరు చూస్తే ముందస్తుకు వెళ్ళే అవకాశాలే పుష్కలంగా కనిపిస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు. కాకపోతే అధికార నేతలు మాత్రం ముందస్తుకు వెళ్లాల్సిన అవసరం తమకేంటి అని అంటున్నారు. ప్రజలు తమకు ఐదేళ్లు పాలించమని సమయం ఇచ్చారని, ఐదేళ్ల పాటు ఉంటామని అంటున్నారు. కానీ ప్రతిపక్ష టి‌డి‌పి మాత్రం..ఖచ్చితంగా వైసీపీ ముందస్తుకే వెళుతుందని డౌట్ పడుతుంది.

చంద్రబాబు ఇప్పటికే చాలాసార్లు ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయని, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని చెబుతూనే ఉన్నారు. ఆ దిశగా ఆలోచన చేసి..మహానాడులో మినీ మేనిఫెస్టోని ప్రకటించారు. ఆ ప్రకటన ప్రజలని కాస్త ఆకట్టుకునేలా ఉన్నాయి. అందుకే వైసీపీ నేతలు ఆ మేనిఫెస్టోపై విమర్శలు చేస్తున్నారు. ఆఖరికి జగన్ సైతం టి‌డి‌పి మేనిఫెస్టోపై స్పందించారంటే దాని ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. కాకపోతే ఆ మేనిఫెస్టో కర్నాటక మేనిఫెస్టోని పోలి ఉందని, అలాగే తాము ఇచ్చే అమ్మఒడి, రైతు భరోసా కార్యక్రమాలని చంద్రబాబు కాపీ కొట్టారని జగన్ చెప్పుకొచ్చారు.

అయితే అలా రెండు పథకాలు ఉన్నాయి గాని..జగన్ ఇచ్చే అమ్మఒడి 13 వేలు మాత్రమే..అది కూడా ఇంట్లో ఒకరికే ఇస్తున్నారు. కానీ చంద్రబాబు 15 వేలు ఇస్తా..ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానని అంటున్నారు. ఇక జగన్ రైతు భరోసా కేంద్రం ఇచ్చే 6 వేలతో కలిపి..రూ.13,500 ఇస్తున్నారు. కానీ చంద్రబాబు 20 వేలు ఇస్తానని అంటున్నారు. అంటే రెండు పథకాలకు తేడా ఉంది.

ఇకపోతే జగన్ ఈ నెల 7న కేబినెట్ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ముందస్తు ఎన్నికలని దృష్టిలో పెట్టుకునే జగన్ కేబినెట్ సమావేశం పెడుతున్నారనే ప్రచారం ఉంది. అదే సమయంలో ఎన్నికల శంఖారావం సభ కూడా నిర్వహించడానికి జగన్ సన్నద్ధం అవుతున్నారని తెలిసింది. గుంటూరు వేదికగానే సభ ఉంటుందని సమాచారం. మొత్తానికి జగన్ ముందస్తుకే ఫిక్స్ అవుతున్నారని తెలుస్తుంది. డిసెంబర్ లో తెలంగాణ ఎన్నికలతో పాటే ఏపీ ఎన్నికలు జరుగుతాయని అంటున్నారు.