‘మమత’కు చోటులేదిక్కడ?

రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్.. తాననుకున్నది కచ్చితంగా చేసే మనస్తత్వం..అతి సాధారణమైన జీవితం.. ప్రతిపక్ష స్థానంలో ఉన్నా.. అధికార పీఠంపై కూర్చున్నా ఆమె వెరీ సింపుల్..రాజకీయంగా ఎవ్వరితోనైనా ఢీ అంటే ఢీ అంటారు.. అవతల మోదీ ఉన్నా.. సోనియా ఉన్నా.. డోంట్ కేర్.. ఆమే మమతా బెనర్జీ. పశ్చిమ బెంగాల్ లో త్రుణమూల్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి కమ్యూనిస్టు కోటను బద్దలు కొట్టి అధికారంలోకి వచ్చిన రాజకీయ యోధురాలు. ఇపుడు దేశవ్యాప్తంగా ఆమె పేరు వినిపిస్తోంది. ఎందుకంటే.. పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించాలని మమత భావిస్తున్నారు. అందులో భాగంగానే గోవా, అస్సాం, తిరపుర, హరియాణ, ఉత్తర ప్రదేశ్, బిహార్, మేఘాలయా రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసే చర్యలు చేపట్టారు. మరో అడుగు ముందుకేసి యూపీ, గోవా తదితర రాష్ట్రాలకు త్వరలో ఎన్నికలు జరుగనున్నాయి. ఆ ఎన్నికల్లో పోటీచేసి ప్రపంచానికి తమ బలం చాటాలని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా దీదీ తెలంగాణపై కూడా ద్రుష్టి సారించినట్లు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. దక్షిణాదిపై ముఖ్యంగా తెలంగాణ రాజకీయాలపై మమతా స్థానిక నాయకులతో మంతనాలు జరిపినట్లు సమాచారం. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలకు చెందిన మాజీ పార్లమెంటు సభ్యులతో మాట్లాడారని సమాచారం. తమ పార్టీతో కలిసి పనిచేసేవారికి ఎప్పటికీ ఆహ్వానం ఉంటుందని టీఎంసీ ఎంపీ సుశ్మిత దేవ్ ప్రకటించడం గమనార్హం. మరో ముఖ్యవిషయమేమంటే టీఆర్ఎస్ పార్టీలో అసంత్రుప్త నేతలెవరు న్నారు? వారికేం కావాలి? వారిని పార్టీలో చేర్చుకుంటే తెలంగాణలో టీఎంసీ ప్రాబల్యం పెంచుకోవచ్చా? అనే విషయాలపై అంచనాకు కూడా వచ్చారని తెలిసింది. టీఎంసీకి చెందిన చెందిన కీలక నేతలు తెలంగాణలో అధ్యయనం చేస్తున్నట్లు సమాచారం. ప్రధాన పార్టీలకు పనిచేసే ఓ ఏజెన్సీ ఆధ్వర్యంలో సర్వే కూడా చేస్తున్నారు.

మరి ఇక్కడ ప్లేస్ ఉంటుందా?

రాజకీయ పార్టీలన్న తరువాత దేశంలో ఎక్కడినుంచైనా పోటీచేయవచ్చు. ఎక్కడైనా పాగా వేయవచ్చు. ఎందుకంటే మనదేశం ప్రజాస్వామ్యదేశం కాబట్టి.. అయితే ఆయా ప్రాంతాల్లో ప్రజల నిర్ణయాలను బట్టి పార్టీలు మనుగడ సాగిస్తాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చురుగ్గా ఉన్నాయి. కారు పార్టీ అధికారంలోఉండగా కమలం పార్టీ అధికారం కోసం ఇప్పటినుంచే పట్టు సాధించే ప్రయత్నాలు చేస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ మాత్రం రేవంత్ వచ్చిన తరువాత కాస్త జోరందుకున్నట్లు కనిపిస్తోంది. తెలుగుదేశం, జనసేన పార్టీలు ఉన్నా లేనట్లే. ఇక టీజేఎస్, తెలంగాణ ఇంటిపార్టీలాంటి చిన్నా చితకా పార్టీలు ఉండనే ఉన్నాయి. కమ్యూనిస్టు పార్టీలు ఉనికి కోసం పోరాడుతున్నాయి అంతే. ఏపీ సీఎం వైఎస్ జగన్ సోదరి షర్మిల కూడా తెలంగాణలో అధికారమే లక్ష్యంగా వైఎస్ఆర్ టీపీని స్థాపించి జోరుగా కార్యకలాపాలు సాగిస్తున్నారు. మాజీ ఐపీఎస్ ఆధికారి ప్రవీణ్ కుమార్ బీఎస్పీలో చేరి రాజకీయంగా యాక్టివ్ గానే ఉన్నారు. సభలు, సమావేశాల్లో పాల్గొంటూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీఎంసీ కూడా తెలంగాణలో అడుగు పెడుతుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు మమత పార్టీకి ఇక్కడ చోటు దక్కడం కష్టమేనని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ రాజకీయ శూన్యత లేదు. బలమైన రాజకీయ పార్టీలున్నాయి.. బలమైన నాయకులూ ఉన్నారు. వారందరినీ కాదని మమతను ఎందుకు ఆదరిస్తారని పరిశీలకులు పేర్కొంటున్నారు.