ఏపీ వరద బాధితులకు తారక ‘హస్తం’!

ఇటీవల ఏపీలో కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా చాలా మంది కష్టాలపాలయ్యారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో వరద భీభత్సం నుండి ప్రజలు తేరుకోలేకపోతున్నారు. దీంతో చాలా మంది తమ ఇళ్లను వదిలి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తాత్కాలిక కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. కాగా ఈ వరదల కారణంగా అనేక మంది తమ ఇళ్లను పోగొట్టుకుని రోడ్డుపై పడ్డారు. అయితే వారిని ఆదుకునే నాథుడే లేడని వారు లబోదిబో మంటూ గుండెలు పగిలేలా విలపిస్తున్నారు.

ఏపీలో నెలకొన్న ఈ విపత్కర సమయంలో పలు రంగాలకు చెందిన ప్రముఖులు తమ వంతు సాయంగా ముందుకు వచ్చి తమ మానవత్వాన్ని చాటుతున్నారు. అయితే ఈ క్రమంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా తన మంచి మనసును చాటుకున్నాడు. ఏపీ వరద బాధితుల బాధలను చూసి తన మనసు చలించిపోయిందని, వారు ఎక్కడ ఉన్నా సురక్షితంగా ఉండాలని తాను కోరుకుంటున్నట్లు పేర్కొన్నాడు. ఏపీ వరద బాధితుల సహాయార్థం తనవంతు సాయంగా రూ.25 లక్షలు విరాళంగా అందిస్తున్నట్లు తారక్ కొద్దిసేపటి క్రితం ప్రకటించాడు.

ఇలా తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎలాంటి విపత్తులను ఎదుర్కొంటున్న సినిమా రంగానికి చెందిన పలువురు స్టార్స్ ముందుండి తమవంతు సాయాన్ని అందిస్తూ తమ మంచితనాన్ని చాటుతున్నారు. అయితే తారక్ కూడా అందరికంటే ముందుగా తన మానవత్వాన్ని చాటుతూ ఇతర స్టార్స్‌కు స్పూర్తిదాయకంగా ఉండటం నిజంగా హర్షించదగ్గ విషయం. ఇక తారక్ చేస్తున్న మంచి పనులకు తోడుగా ఆయన అభిమానులు కూడా ముందుండి మరీ వరద బాధితులకు సహాయం చేస్తున్నారు. కాగా సినిమాల పరంగా తారక్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.