తిరుమల దర్శనాన్ని వాయిదా వేసుకోండి.. టీటీడీ చైర్మన్ విజ్ఞప్తి..!

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చేవారు తమ దర్శనాన్ని వాయిదా వేసుకుంటే మంచిదని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు. తిరుమల రెండో కనుమదారిలో ఇవాళ ఉదయం కొండచరియలు విరిగిపడ్డ నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఉదయం రెండో కనుమదారిలో కొండపై నుంచి పెద్ద పెద్ద బండరాళ్లు దొర్లుకుంటూ వచ్చి ఘాట్ రోడ్డుపై పడ్డాయి. దీంతో మూడు ప్రాంతాల్లో రోడ్డు భారీగా దెబ్బతింది.

అదృష్టవశాత్తు ఆ సమయంలో రాళ్లు పడ్డ ప్రాంతంలో వాహనాలు ఏమీ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఒక ఆర్టీసీ బస్సు మాత్రం తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఆ బస్సులో అతి సమీపంలోనే బండరాళ్లు రోడ్డుపై పడ్డాయి. ఘాట్ రోడ్డుపై కొండ చరియలు విరిగిపడడంతో కొండపైకి వెళ్లే వాహనాల రాకపోకలను టీటీడీ అధికారులు నిలిపివేశారు. దారి మధ్యలో ఆగిపోయిన వాహనాలను లింకు రోడ్డు ద్వారా కొండపైకి పంపుతున్నారు. కొండ నుంచి దిగువకు వచ్చే రోడ్డు గుండా వాహనాలను అనుమతిస్తున్నారు.

కొండచరియలు విరిగి పడ్డ ప్రాంతాన్ని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు. పెద్ద బండరాళ్లు పడడంతో మూడు చోట్ల రోడ్డు ధ్వంసమైంది అట్లు చెప్పారు. దెబ్బతిన్న రహదారిని బాగు చేసేందుకు నిపుణులను రప్పిస్తున్నామని, పునరుద్ధరణకు మరో మూడు రోజుల సమయం పడుతుందని ఆయన తెలిపారు. తిరుమలకు వచ్చే భక్తులు తమ దర్శనాన్ని వాయిదా వేసుకుంటే మంచిదని, టికెట్లు ఉన్నవారు వచ్చే ఆరు నెలల్లో ఎప్పుడైనా దర్శనం చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.