రేవంత్ కామెంట్స్ పై ఇద్దరూ మౌనం

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ముందునుంచీ అంటే పార్టీ పగ్గాలు చేపట్టినప్పటినుంచీ అదే దూకుడు ప్రదర్శిస్తున్నారు. సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరుగుతూనే.. కేంద్రం పెద్దలను కూడా టార్గెట్ చేస్తున్నారు. అయితే.. రేవంత్ మాటలకు, సవాళ్లకు ఇటు కేసీఆర్ సర్కారు కానీ, అటు బీజేపీ కానీ సమాధానం ఇవ్వడం లేదు. హైదరాబాదు శివారులోని కొంపెల్లిలో జరిగిన పార్టీ శిక్షణ కార్యక్రమంలో రేవంత్ ఇరు పార్టీల వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పడిన తరువాత రాష్ట్రంలో అనేక అవినీతి జరిగిందని, ముఖ్యంగా ప్రాజెక్టుల నిధులు దారి మళ్లాయని, కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కోట్ల రూపాయలు మళ్లించారని పేర్కొన్నారు. తన వద్ద ఇందుకు సంబంధించి అన్ని ఆధారాలున్నాయని కూడా చెప్పారు. సీబీఐ విచారణ జరిపితే అన్నీ అందజేస్తానని కూడా పేర్కొన్నారు. మరో అడుగు ముందుకేసి.. అమిత్ షాకు అన్నీ వివరిస్తానని, అయితే అపాయింట్ మెంట్ ఇప్పించేలా టీబీజేపీ చీఫ్ బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవ చూపాలని కోరాడు.

అంటే ఒక్కటే బాణంతో అటు కేసీఆర్ ను, ఇటు బీజేపీని కొట్టాలని ప్రయత్నించాడు. రేవంత్ రెడ్డి ఆవేశపూరిత ప్రసంగానికి చప్పట్లయితే దక్కాయి కానీ.. ఆ తరువాత ఆ మాటలను కమలం, గులాబీ పార్టీలు అస్సలు పట్టించుకున్నట్లు కనిపించలేదు. మేం అపాయింట్ మెంట్ ఇప్పిస్తే క్రెడిట్ కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందనేది బీజేపీ నేతల భావన. అందుకే స్థానిక కమలం నేతలు ఈ విషయంపై ఏమీ మాట్లాడటం లేదు. కారు పార్టీ నాయకులు కూడా. . వినీ విననట్లు వ్యవహరిస్తున్నారు. రేవంత్ కామెంట్స్ పై స్పందిస్తే మరీ అదో ఇష్యూ అవుతుంది.. ఎందుకులే అని గులాబీ నేతలు మౌనంగా ఉండిపోయారు. అధిష్టానం నుంచి ఏమైనా సంకేతాలు అందితే తప్ప మాట్లాడే పరిస్థితి లేదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అంతవరకు రేవంత్ వేదన.. మౌన రోదనే..