’వైద్యం‘పై హరీశ్ మార్క్..

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో ముఖ్యమంత్రి కేసీఆర్ మేనల్లుడు, సీనియర్ నాయకుడు, మంత్రి హరీశ్ రావు ప్రాధాన్యం అందరికీ తెలుసు. పార్టీ విధేయుడిగా.. మామకు ఇష్టమైన వ్యక్తిగా ఆయనకు పేరుంది. ఉద్యమ సమయంలోనూ హరీశ్ రావు కీలకలంగా పనిచేశారు. పార్టీలో కేసీఆర్, కేటీఆర్ తో విభేదాలున్నాయని మీడియాలే అనేకసార్లు వార్తలు వచ్చాయి. చర్చలు కూడా జరిగాయి. అయితే వాటిని హరీశ్ కానీ,పార్టీ కాని పట్టించుకోలేదు. ఖండించలేదు. ఎవ్వరేమనుకున్నా హరీశ్ కు ఉన్న స్థానం ఆయనకుంది. అది హరీశ్ కు కూడా తెలుసు. అందుకే పార్టీలో ఆయనంటే అంత గౌరవం. కేసీఆర్ కూడా అల్లుడికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇచ్చారు. ఇపుడు మరో బాధ్యతను అప్పగించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఈటలను తొలగించిన అనంతరం ఆ శాఖను కేసీఆర్ తనవద్దే ఉంచుకున్నారు. అయితే ఇటీవల ఆ బాధ్యతను హరీశ్ రావుకు అదనంగా అప్పగించారు. ఆల్రెడీ హరీశ్ రావు ఆర్థిక మంత్రి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం బాధ్యతలు స్వీకరించారు.

వెంటనే.. సమయపాలనపై ఆదేశాలిచ్చిన మంత్రి

వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే హరీశ్ రావు ఆ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పీహెచ్సీల్లో వైద్యులు సమయపాలన పాటించేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. వైద్యులు ఇష్టానుసారం వస్తుండటంతో రోగులకు సరైన వైద్యం అందడం లేదని.. ఈ సమస్యకు చెక్ చెప్పాలని పేర్కొన్నారు. శాఖలో పలు పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ముఖ్యంగా ఆరోగ్య శ్రీకి సీఈఓ లేరని అధికారులు వివరించారు. సమస్యలన్నీ నిదానంగా పరిష్కారమవుతాయని, అంతలోపు పేద రోగులు ఇబ్బంది పడకుండా చూడాలని పేర్కొన్నారు. అందరికీ అందుబాటులో ఉండే హరీశ్ రావు వైద్య మంత్రి కావడంతో ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సమస్య వస్తే వెంటనే చెప్పుకోవచ్చని.. ఆయన కూడా స్పందిస్తారని పేర్కొంటున్నారు.