మోదీపై సమర శంఖం పూరించిన కేసీఆర్‌

తెలంగాణలో మరో ఉద్యమం మొదలైంది.. అదే రైతు ఉద్యమం.. దీనికి కేసీఆరే నేతృత్వం వహిస్తున్నారు. ఉద్యమ నాయకుడిగా పేరున్న కేసీఆర్‌ తెలంగాణ కోసం ఏళ్ల తరబడి కొట్లాడాడు.. నిరసన చేశాడు.. ధర్నాలు, దీక్షలు.. ఆమరణ నిరాహార దీక్ష..ఇలా ఎన్నో..ఎన్నెన్నో.. ఇన్ని నిరసన కార్యక్రమాలుచేసి.. అనేకమంది ప్రాణాలు కోల్పోయిన తరువాత ప్రత్యేక తెలంగాణ వచ్చింది.. ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్‌ ప్రభుత్వమని ఆ పార్టీ నాయకులు చెబుతున్నా క్రెడిట్‌ మాత్రం కేసీఆర్‌కే దక్కుతుంది. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్‌పార్టీ ఘన విజయం సాధించడం.. కేసీఆర్‌ సీఎం కావడం.. మరోసారి జరిగిన ఎన్నికల్లోనూ ఘన విజయం సాధించడం చకచకా జరిగిపోయాయి. ఆ తరువాత రాష్ట్ర అభివృద్ధిపైనే ఉద్యమ నాయకుడు దృష్టి నిలిపాడు. అయితే ఇప్పుడు మళ్లీ ఉద్యమబాట పట్టాడు. అదీ మోదీపైనే.. గతంలో కేంద్రంపై తెలంగాణ కోసం ఉద్యమం చేయగా ఇపుడు అన్నదాత కోసం పోరాటం మొదలుపెట్టాడు.

తెలంగాణలో రైతులు పండించిన వరిని కేంద్రం కొనుగోలు చేయకపోవడం.. రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని బీజేపీ నాయకులు చెబుతుండటం మధ్యలో రైతులు ప్రాణాలు కోల్పోతుండటంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. వరిపంటను కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలంటూ మొన్న బీజేపీ, కారు పార్టీ నాయకులు పోటాపోటీగా ధర్నా కార్యక్రమాలు చేశాయి. ఇపుడు మరో ముందడుగు వేసిన కేసీఆర్‌ తానే స్వయంగా రంగంలోకి దిగారు. సమస్య ఇలాగే ఉండిపోతే.. కేంద్రం కొనుగోలు చేయకపోతే టీఆర్ఎస్‌ పార్టీకి చెడ్డపేరు వస్తుందని గుర్తించిన కేసీఆర్‌ ముందుజాగ్రత్త పడ్డాడు. అందుకే పార్టీ శ్రేణులను మొత్తం రంగంలోకి దించాడు. ఇందిరాపార్కు వేదికగా ఢిల్లీపై అస్త్రం సంధించాడు. వరిని అసలు కొంటారా.. కొనరా? అని నేరుగా అడిగాడు. బాల్‌ను కేంద్రం కోర్టులోకి నెట్టేశాడు. అంతేకాదు.. మోదీ చేస్తున్న తప్పిదాలను వివరించి చెప్పాడు. అంతేకాదు..గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌ (జీహెచ్ఐ)లో 116 దేశాలలో భారత్‌ స్థానం 101 ఉందని, ఇది దేనికి సంకేతమని సూటిగా ప్రశ్నించారు. ఈ ఉద్యమం పరిష్కారమయ్యే వరకు ఆగదని..ఢిల్లీ వేదికగా అన్ని రాష్ట్రాలను ఏకం చేస్తానని పరోక్షంగా మోదీని హెచ్చరించారు. దీనిని బట్టి చూస్తే కేసీఆర్‌ వరి సమస్యను సీరియస్‌గా తీసుకోవడంతోపాటు బీజేపీని దెబ్బకొట్టేందుకు పకడ్బందీ ప్రణాళిక రూపొందిచనట్లు తెలుస్తోంది.