పాపం బాబు.. పోరాడుటయా? పారిపోవుటయా?

కుప్పం మునిసిపాలిటీ ఎన్నికలలో పరాజయం తప్పదని చంద్రబాబునాయుడుకు చాలా కాలం ముందే తెలుసు. స్థానిక పరిస్థితులను ఆయన సరిగానే పసిగట్టారు. ఓటమి తప్పదని గ్రహించగలిగారేమో గానీ.. ఫలితం ఇలా ఉంటుందని, ఇంత ఘోరమైన అవమానకరమైన ఓటమి ఎదురవుతుందని ఆయన అనుకుని ఉండకపోవచ్చు. 25 వార్డుల్లో కేవలం ఆరు మాత్రమే గెలుచుకుని పార్టీ కుదేలైపోయింది. పరువు గంగపాలు అయింది.

కిం కర్తవ్యం? ఏం చేయాలి?

చంద్రబాబునాయుడు ముందున్న అతిపెద్ద ప్రశ్న ఇది. బహుశా ఈ సమయానికి ఏం చేయగలడో తోచుబాటు అయ్యే పరిస్థితిలో ఆయన ఉండకపోవచ్చు. ఆయన తక్షణ కర్తవ్యం స్ఫురించినా లేకపోయినా.. ఆయన ముందు ఇప్పుడు రెండు ఆప్షన్స్ ఉన్నాయి.

ఒకటి- ఏ కుప్పంలో అయితే ప్రజలు తన పార్టీని తిరస్కరించారో.. అదే కుప్పంలో యథాపూర్వ వైభవం దక్కేలాగా పోరాటం సాగించడం. ఒకప్పట్లో చంద్రబాబునాయుడుకు కుప్పం నియోజకవర్గంలో 70వేల పైచిలుకు ఓట్ల మెజారిటీ వచ్చేది. ఇప్పుడు మునిసిపాలిటీలో ఒకటిరెండు చోట్ల తప్ప ప్రతిచోటా.. వందల ఓట్ల తేడాలతో వార్డులను తెలుగుదేశం వారు కోల్పోయారు. ఇలాంటి పరిస్థితుల్లో పునర్వైభవం రావాలంటే.. చంద్రబాబునాయుడు చాలా శ్రమించాల్సి ఉంటుంది.

రెండు- కుప్పం నియోజకవర్గాన్ని విడిచిపెట్టి, మరో నియోజకవర్గం చూసుకోవడం. నిజానికి ఆయన కుప్పంను విడిచిపెట్టేలా వైసీపీ నాయకులు ఒక రకమైన మైండ్ గేమ్ ఆడుతున్నారు. కుప్పం ఆయనకు బైబై చెప్పేస్తున్నదంటూ పదేపదే ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబునాయుడు ఈసారి ఎన్నికలకు మరో నియోజకవర్గం వెతుక్కోవాల్సి వస్తుందంటూ ఈ ఎన్నికలో వైసీపీ విజయానికి సారథ్యం వహించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా అంటున్నారు.

నిజానికి కుప్పం ఎన్నికలో పోలింగ్ జరగడానికి ముందునుంచే.. చంద్రబాబునాయుడు వచ్చే ఎన్నికలకు నియోజకవర్గం మారే ఉద్దేశంతో ఉన్నారంటూ పుకార్లతో కూడిన ప్రచారం బాగానే మొదలైంది. ఫలితం తర్వాత సరేసరి.. మరీ ముమ్మరంగా చంద్రబాబు కుప్పం గురించి పునరాలోచనలో ఉన్నారని, కుప్పంలో ఇక లోకేష్ బరిలోకి దిగుతారని రకరకాల ప్రచారాలు మొదలవుతున్నాయి. ఇలాంటి ప్రచారాలు ఏ స్థాయికి వెళుతున్నాయంటే.. తెలుగుదేశం శ్రేణులు కూడా తమ ముందున్న అవకాశం అదొక్కటేనని బాబు- మరో చోటకు వెళ్లాల్సిందేనని అనుకునేలా ఈ ప్రచారాలు ఉన్నాయి.

అదే జరిగితే.. తెలుగుదేశం పార్టీకి అది ఆత్మహత్యాసదృశం కింద లెక్క. కుప్పంనుంచి బాబు పక్కచూపులు చూస్తున్నారనే ప్రచారం నమ్మగలిగేలా బయటకు పొక్కితే చాలు.. రాష్ట్రం మొత్తం పార్టీ శ్రేణులు డీలా పడతాయి. దాని ప్రభావం.. వైసీపీలోకి వలసలు బీభత్సంగా పెరిగినా ఆశ్చర్యం లేదు. అందుకే ఆప్షన్స్ రెండు ఉన్నప్పటికీ.. చంద్రబాబు ఒకటో మార్గం తప్ప మరొకటి అనుసరించలేరు.