గలాట.. గల్లీల్లోనే.. ఢిల్లీలో కాదు

తెలంగాణ సీఎం కేసీఆర్ ను జైలుకు పంపుతాం.. ఆయన అవినీతికి హద్దు లేకుండా పోయింది.. రాష్ట్రాన్ని కల్వకుంట కుటుంబం దోచుకుంటోంది.. అని టీబీజేపీ చీఫ్ బండి సంజయ్ గొంతెత్తుతూ ఉంటాడు. రెండు వారాలుగా ఆయన రాష్ట్రంలో పాదయాత్ర కూడా చేస్తున్నాడు. ఎప్పుడు.. ఎక్కడ మాట్లాడినా కేసీఆర్ అవినీతి గురించే మాట్లాడతాడు. ప్రగతి భవన్ నుంచి జైలుకు పంపుతామని గట్టిగా చెబుతాడు. అయితే బండి సంజయ్ గట్టిగా చెబుతున్నా.. అధిష్టానం మాత్రం ఈ వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకోవడం లేదని అర్థమవుతోంది.

బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇంటర్వ్యూ గమనిస్తే కేసీఆర్ పై కమలం పార్టీకి సాఫ్ట్ కార్నరే ఉన్నట్టుంది. ఈ రెండు పార్టీల వ్యవహారాన్ని గమనిస్తే టీఆర్ఎస్, బీజేపీల మధ్య గలాల గల్లీల్లోనే.. ఢిల్లీలో కాదని అర్థమవుతుంది. కిషన్ రెడ్డిని ఇటీవల తెలుగుమీడియా ఇంటర్వ్యూలో పలు ప్రశ్నలను సంధించింది. భూకబ్జాలు, ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందని బండి సంజయ్ చెబుతున్నారు కదా అని కిషన్ ను ప్రశ్నిస్తే.. దానికి ఆధారాలు లేవని, కేసీఆర్ అవినీతి ప్రూవ్ కాలేదని, మరి అలాంటపుడు జైలుకెళా పంపుతామని మీడియానే ప్రశ్నించాడు. మీకేమైనా అలాంటివి తెలిసినా, ఆధారాలుంటే మాకు ఇవ్వండి చూస్తాం అని చెప్పాడు. దీనిని బట్టి మనకు అర్థమయ్యేదేమంటే.. కేంద్రం పెద్దలు కేసీఆర్ తో బాగానే టచ్ లో ఉన్నారు.. కేసులతో ఇబ్బంది పెట్టరు అని.. ఏడేళ్లుగా అవినీతి జరిగిందని చెప్పడానికి కూడా ఆధారాలు లేవని కూడా చెప్పాడు. బండి సంజయ్ ఒక వైపు అలా చెబుతుంటే కిషన్ రెడ్డి మాత్రం ఆయనకు వ్యతిరేకంగా చెప్పడం చూస్తుంటే.. అంతా రాజకీయమని అర్థమవుతుంది.