ఇక నూజివీడు మామిడి చ‌రిత్ర పుట‌ల్లోకే… !

_ ప్రకృతితో పోరాటం చేయలేకపోతున్న వ్యాపారస్తులు
_ తొలగిస్తున్న మామిడి తోటలు
_ మామిడి తో పోలిస్తే రైతులకు మిగతా పంటలే లాభం
_ అడుగడుగునా అడ్డంకులే

నూజివీడు నియోజకవర్గం పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది నూజివీడు మామిడి. నూజివీడు మామిడికి మన భారతదేశం తో పాటు ఇతర దేశాలలో కూడా మంచి గుర్తింపు ఉన్న విషయాన్ని గర్వంగా చెప్పుకోవచ్చు. గతంలో నూజివీడుతో పాటు చింతలపూడి, పోలవరం నియోజకవర్గాలలో సైతం మామిడి తోటలు అధిక విస్తీర్ణంలో ఉండేవి. మారుతున్న కాలంతో పాటు ప్రకృతి సహకరించక ప్రస్తుతం చింతలపూడి, పోలవరం నియోజకవర్గాలలో మామిడిని పూర్తిగా తొలగించేశారు. అలాగే ఏడాదికి ఏడాది నూజివీడు నియోజకవర్గంలో కూడా మామిడి తోటలు తరిగిపోతున్నాయనే చెప్పుకోవాలి. మామిడి కాపు, ఎగుమతుల విషయాన్ని పక్కన పెడితే మిగతా పంటలే లాభదాయకంగా ఉండటంతో మామిడి పంటపై రైతులు మక్కువ చూపటం లేదు. ప్రస్తుతానికి నూజివీడు నియోజకవర్గంలో ఆగిరిపల్లి మండలంలో 15097, నూజివీడు మండలంలో 12675 చాట్రాయి మండలంలో 3311, ముసునూరు మండలంలో 2041 ఎకరాలలో రైతులు మామిడి సాగు చేస్తున్నట్లు ఉద్యాన శాఖ అధికారిణి ఆర్ హేమ తెలిపారు.

ప్రకృతి తో పోరాటం చేయలేకపోతున్న వ్యాపారస్తులు:
మామిడి తోటలో కొనుగోలు చేసే వ్యాపారస్తులు ప్రకృతితో పోరాటం చేయలేకపోతున్నారని చెప్పాలి. మామిడికి ఆది నుండి కూడా ప్రకృతి ఆటంకం కలిగించకుండా ఉంటేనే అటు రైతుకు, వ్యాపారస్తులకు లాభం తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా పూత సమయంలో మంచు ప్రభావంతో పూత రాలిపోతుంటుంది. పూత దశ నుంచి పిందె దశకు వెళ్లాక కాయలకు మంగు ఏర్పడకుండా ఉండాలి. కాయలు తయారీ దశకు వచ్చాక వేసవిలో గాలి దుమ్ములు అధికంగా ఉండటంతో కాయలు రాలిపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లుతుంది. దీనికి తోడు వడగళ్ల వాన కురిసినట్లయితే కాయ రంగు మారటం, త్వరగా పాడైపోవడం జరుగుతుంది. కాలానుగుణంగా ప్రకృతి పరిస్థితులను అధిగమించి వ్యాపారస్తులకు సొమ్ములు చేతికి అందే వరకు కూడా నమ్మకం లేకుండా పోతుంది. అందుకే చాలామంది రైతులు మామిడి పంటపై మక్కువ తగ్గించుకుని వేరే పంటలపై, ఆధారపడుతున్నారని చెప్పటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

తొలగిస్తున్న మామిడి తోటలు:
మామిడి తోటలో స్థానంలో ఇప్పటికే పామాయిల్ వంటి తోటలను అధిక విస్తీర్ణంలో వేయడం జరిగింది. తొలగించిన మామిడి తోటల స్థానాలలో మొక్కజొన్న వంటి పంటలను రెండు దఫాలు వేసి సొమ్ములు చేసుకుంటున్న రైతులు కూడా ఉన్నారు. వాతావరణ పరిస్థితులతో సంబంధం లేని సీజనల్ పంటల ద్వారా ఆర్థిక ప్రయోజనాలు పొందటానికి రైతులు మక్కువ చూపుతున్నారు. అందుకే ప్రస్తుత తరుణంలో సీజనల్గా ఒక కాపు ద్వారా మాత్రమే రైతులకు సొమ్ములు అందజేసే మామిడి తోటలను తొలగిస్తున్నారు.

మామిడి తో పోలిస్తే మిగతా పంటలే రైతులకు లాభం:
సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఆదాయాన్ని తెచ్చిపెట్టే మామిడితో పోలిస్తే మిగతా పంటలు రైతులకు లాభదాయకంగా ఉంటాయి. ఆరుకాలం కష్టపడిన రైతుకు సొమ్ములు చేతికి వచ్చేవరకు కూడా గాలిదుమ్ము, వర్షం, మంచు ప్రభావాలతో మామిడి రైతులకు సొమ్ము రావటం ముడిపడి ఉంటుంది. ఒక్కొక్కసారి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా కుదేలైన మామిడి రైతులు వ్యాపారస్తులు కోకొల్లలు అని చెప్పుకోవాలి.

అడుగడుగునా అడ్డంకులే:
ప్రకృతి దోబూచులాట మధ్య మామిడి రైతుకు ఆది పంట చేతికి వచ్చేవరకు అడుగడుగునా అడ్డంకులే ఎదురవుతాయి. ప్రస్తుత తరుణంలో మామిడి కాయలను కాపాడుకునేందుకు పిందె దశకు చేరుకున్న దగ్గర నుండే రైతులు, వ్యాపారస్తులు తమ పంటను కాపాడుకోవడం కోసం, మేలైన దిగుబడి రావటం కోసం, మంచి రంగు రావడం కోసం, దీంతోపాటు కోతులు కొండముచ్చుల వంటి వాటి నుండి పంట పాడు చేయకుండా ఉండటం కోసం
కవర్లను కడుతున్నారు.

కొసమెరుపు: మామిడి రైతులు నష్టపోకుండా ఉండాలంటే మామిడి తోటలు తొలగించకుండా ఉండాలంటే ప్రభుత్వాలు మామిడి సస్యరక్షణకు, దిగుబడికి, గిట్టుబాటు ధరకు తగిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. లేదంటే ఇప్పటికే వేలాది హెక్టార్లలో తొలగించబడిన మామిడి తో పాటు నూజివీడు మామిడి కూడా కనుమరుగయ్యే అవకాశం ఉంది.