రెండున్నర గంటల భేటీ… ఏం మాట్లాడుకున్నారో…?

జైలు నుంచి మధ్యంతర బెయిల్ పై విడుదలైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ మధ్య దాదాపుగా రెండున్నర గంటలపాటు భేటీ జరిగింది. అనారోగ్య కారణాలతో బెయిల్ పై విడుదలైన చంద్రబాబును పరామర్శించేందుకు పవన్‌ కళ్యాణ్‌, జనసేన పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నివాసానికి వచ్చారు. ప్రధానంగా ఆంధ్రాలో భవిష్యత్తు రాజకీయం, ఉమ్మడి మ్యానిఫెస్టో, క్షేత్రస్థాయి పోరాటాలు వంటి అంశాల పై ఇరుపక్షాలు ఒక నిర్ణయానికి వచ్చాయని తెలిసింది. త్వరలో సమన్వయ కమిటీ భేటీ నిర్వహించి కార్యాచరణను ఖరారు చేయనున్నారు.

వైద్య పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును పవన్‌ కళ్యాణ్‌ పరామర్శించారు. నాదెండ్ల మనోహర్ తో కలిసి మధ్యాహ్నం 3.15 గంటలకు వచ్చిన పవన్‌ కళ్యాణ్‌ ను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బయటకు వచ్చి సాదరంగా ఆహ్వానించారు. చంద్రబాబు ఆరోగ్యం, మధ్యంతర బెయిల్, వరుసగా పెడుతున్న కేసులు, న్యాయపోరాటం వంటి అంశాల పై కూడా చర్చ జరిగింది. అనంతరం రాష్ట్రంలో ఉమ్మడి కార్యాచరణ దిశగా చర్చలు జరిగాయని సమాచారం అందింది. ప్రధానంగా రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబును పరామర్శించి వచ్చిన అనంతరం పవన్‌ కళ్యాణ్‌ పొత్తులను ప్రకటించగా.. ఆ తరువాత రాజమండ్రిలోనే రెండు పక్షాల సమన్వయ కమిటీ భేటీ జరిగింది. ఉమ్మడి మ్యానిఫెస్టోని ప్రకటించాలని నిర్ణయించారు. దీంతోపాటు జిల్లాల్లో రెండుపక్షాల నేతలు కలిసి కూర్చొని మాట్లాడుకోవడం, ఉమ్మడి పోరాటాలు, రాష్ట్ర స్థాయి నాయకులు పరిశీలకులుగా వెళ్లడం కూడా అనేక జిల్లాల్లో జరిగింది. రాజమండ్రిలో జరిగిన మహానాడులో తెలుగుదేశం మినీ మ్యానిఫెస్టోని ప్రకటించి సూపర్ సిక్స్ గా ప్రజల్లోకి వెళ్లింది. అయితే ఈ ఆరు అంశాలకు తోడు మరో నాలుగు అంశాలను కూడా కలపాలని సమన్వయ కమిటీ సమావేశంలో జనసేన ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను తెలుగుదేశం కూడా పరిశీలిస్తానని హామీ ఇచ్చింది. అనంతరం శనివారం భేటీ అయిన చంద్రబాబు, పవన్ మధ్య ఉమ్మడి మ్యానిఫెస్టో పై చర్చ జరిగిందని సమాచారం అందింది. ఉమ్మడి మ్యానిఫెస్టో ప్రకటిస్తేనే రెండు పార్టీల్లో కూడా జవాబుదారీతనం రావడంతో పాటు, కలిసి పోరాటం చేసేందుకు కావాల్సిన రాజకీయబలం కూడా వస్తుందని భావించారు.

ఇక క్షేత్రస్థాయిలో నిర్వహించాల్సిన పోరాటాల పై కూడా ప్రధానంగా చర్చ జరిగింది. ఇసుక, మద్యం వంటి అంశాలతో పాటు, నిత్యావసర వస్తువుల పెరుగుదల మధ్య తరగతి, కిందిస్థాయి వర్గాలను వేధిస్తున్న విద్యుత్ చార్జీల పెంపు వంటి అంశాల పై కూడా ఉమ్మడి పోరాటాలు నిర్వహించడం పై కూడా చర్చ జరిగింది. ఈ చర్చలో అనేక అంశాలు ప్రతిపాదనలుగా మారాయి. ఈ ప్రతిపాదనలు అన్నింటినీ సమన్వయ కమిటీ భేటీలో చర్చించి ప్రకటించాలని కూడా భావించారు. త్వరలోనే రెండు పక్షాలకు చెందిన నేతలతో జనరల్ బాడీ సమావేశాలు నిర్వహించి ఉమ్మడి పోరాటాలకు సిద్దం చేయాలని కూడా భావించారు. వీటన్నింటికీ రూపకల్పన చేసేందుకు రెండుపక్షాల సమన్వయ కమిటీ భేటీ కూడా నిర్వహించాలని భావించారు. తెలంగాణాలో తెలుగుదేశం పోటీ నుంచి ఎందుకు ఉపసంహరించుకుంది చంద్రబాబు వివరించగా, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేసే అంశానికి సంబంధించి పవన్‌ కళ్యాణ్‌ కూడా చంద్రబాబుకు వివరించినట్టు తెలిసింది.

చంద్రబాబు పై ఇటీవల ప్రభుత్వం మరో రెండు కేసులు అంటే మద్యం, ఇసుక వంటి అంశాల పై కేసులు అంశం కూడా చర్చకు వచ్చింది. వీటన్నింటి నేపథ్యంలో భవిష్యత్తు కార్యాచరణలో ఒక వైపు న్యాయపోరాటం చేస్తూనే మరోవైపు అధికార పార్టీ అక్రమ కేసులు, ప్రజా వ్యతిరేక విధానాల పై క్షేత్రస్థాయి పోరాటాలు కూడా ఉధృతం చేయాలని ఇరుపక్షాల నేతలు నిర్ణయించారు. చంద్రబాబు ప్రస్తుతం మధ్యంతర బెయిల్ పై ఉండటంతో రాజకీయ అంశాలకు సంబంధించి ఇరుపక్షాల నేతలు ఎవ్వరూ కూడా మీడియాతో మాట్లాడేందుకు ఇష్టపడలేదు.