సుప్రీం తీర్పుపై టీడీపీ నేతల్లో ఉత్కంఠ..!

చంద్రబాబు కేసులో సుప్రీం కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అవినీతి నిరోధక చట్టంలోని 17 ఏ చంద్రబాబుకు వర్తిస్తుందా లేదా అనే అంశం పై సుప్రీంకోర్టు వెలువరించే నిర్ణయం కోసం ఆంధ్రప్రదేశ్ లో అన్ని రాజకీయపక్షాలు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నాయి. చంద్రబాబు పై నమోదు చేసిన కేసులు చెల్లవని, 17 ఏ ప్రకారం గవర్నర్ అనుమతి తీసుకోలేదని చంద్రబాబు తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పి దాఖలు చేశారు. దీని పై సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ తీర్పు రాష్ట్ర రాజకీయాల పై ప్రభావం చూపనుంది.

అవినీతి నిరోధక చట్టంలోని 17 ఏ ద్వారా తెచ్చిన సవరణతో గత ప్రభుత్వంలో పనిచేసిన మంత్రులు, ముఖ్యమంత్రి పై కేసు నమోదు చేయాలంటే దర్యాప్తు సంస్థ గవర్నర్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా ఏపీ సిఐడీ తెలుగుదేశం అధినేత చంద్రబాబు పై స్కిల్ డెవలప్‌మెంట్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిందని, ఇది చెల్లదని, గవర్నర్ అనుమతి తీసుకోకుండా 17 ఏ ను ఉల్లంఘించారని చంద్రబాబు తరపు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ లపై వాదనల అనంతరం హైకోర్టు చంద్రబాబు తరపు న్యాయవాదులు వేసిన పిటిషన్ ను కొట్టివేసింది. ఆ తరువాత హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ చంద్రబాబు తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై చంద్రబాబు తరపు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది హరీష్‌ సాల్వే, సీఐడీ తరపున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ఈ వాదనల అనంతరం సుప్రీం ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు తరపు న్యాయవాదులు ఆయనకు ఫైబర్ గ్రిడ్ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పి దాఖలు చేశారు. ఇటీవల ఈ కేసు విచారణకు రాగా, సుప్రీంకోర్టు ఈ కేసులో కూడా 17 ఏ వర్తిస్తుంది కదా అని వ్యాఖ్యానించి కేసు విచారణను నవంబర్ 9వ తేదీకి వాయిదా వేసింది. అయినప్పటికీ, శనివారం వరకూ సుప్రీంకోర్టులో అవినీతి నిరోధక చట్టంలోని 17ఏ పై తీర్పు ఇంకా రాలేదు. సోమవారం తీర్పు వచ్చే అవకాశం ఉందని ఎదురుచూస్తున్నప్పటికీ, ఇంకా ఎటువంటి ధృవీకరణ రాలేదు.

ఈలోపు రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు పై మరిన్ని కేసులను నమోదు చేయడం ప్రారంభించింది. ఆయన 2014 నుంచి 2019 వరకూ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మద్యం పాలసీ, ఇసుక పాలసీ పై తీసుకున్న నిర్ణయాలు ఖజానాకు నష్టం వాటిల్లే విధంగా ఉన్నాయని సిఐడీ అభియోగం మోపింది. దీని పై రెండు ఎఫ్‌ఐఆర్‌ లు కూడా నమోదు చేశారు. దీంతో చంద్రబాబు పై వైసిపి ప్రభుత్వం అప్పటి మంత్రివర్గ నిర్ణయాల పై నేటికీ ఆరు కేసులు నమోదు చేసింది. మరో నాలుగు కేసులు కూడా సిద్దం చేసి ఉంచారు. అవినీతి నిరోధక చట్టంలోని 17 ఏ పై సుప్రీంకోర్టు ఇచ్చే స్పష్టత ఆధారంగా చంద్రబాబు పై మిగతా కేసుల భవితవ్యం తేలనుంది. అన్ని కేసుల్లో కూడా అవినీతి నిరోదక చట్టంలోని పలు సెక్షన్ ల కింద కేసు నమోదు చేయడంతో అసలు 17 ఏ ప్రకారం అనుమతి తీసుకోకుండా పెట్టిన కేసులు చెల్లవని టీడీపీ వాదిస్తోంది. అందుకనే స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుకు రిమాండ్ ను విధిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్ చేయాలని సుప్రీంకోర్టులో క్వాష్ పిటీషన్ దాఖలు చేశారు. ఇప్పుడు దీని పై వచ్చే తీర్పే చంద్రబాబు పై ఉన్న మిగతా కేసుల భవితవ్యాన్ని కూడా తేల్చనుంది.

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆరు కేసులు నమోదు చేయగా, కృష్ణా పుష్కరాలు, నరేగా పనుల్లో అవకతవకలు జరిగాయని, నీరు-చెట్టు , సచివాలయ భవనాల నిర్మాణం వంటి అంశాల పై కూడా కేసులు నమోదు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాచారం తెప్పించుకుంటోందని తెలుగుదేశం నేతలకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు పై ఎన్ని కేసులు నమోదు చేసినప్పటికీ, సుప్రీంకోర్టులో క్వాష్ పిటీషన్ పై 17 ఏ వర్తిస్తుందని తీర్పు వస్తే .. ఈ కేసులన్నీ నిలబడవని టీడీపీ లీగల్ సెల్ న్యాయవాదులు అంటున్నారు. ఒకవేళ సుప్రీంకోర్టులో తీర్పు వ్యతిరేకంగా వస్తే మాత్రం చంద్రబాబు కు ఈ కేసులన్నింటిలో బెయిల్ తీసుకోవాల్సి ఉంటుందని న్యాయవాదులు విశ్లేషిస్తున్నారు.