ఢిల్లీలో దోస్తీ… గల్లీలో కుస్తీ… ఇదే ట్రెండ్‌…!

నిన్నటి వరకూ ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ అన్న చందంగా ఉన్న బీజేపీ, వైసీపీ మధ్య సంబంధాలు.. ఇటీవల నువ్వా, నేనా అన్న రీతిలో మారాయి. వైసిపి నేతలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడాన్ని రాష్ట్ర బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, మద్యం, ఇసుక వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి సారించిన బీజేపీ.., విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని భారత ప్రధాన న్యాయమూర్తికి ఏకంగా లేఖ రాసింది. ఇదిలా ఉంటే, ఇదంతా ఎన్నికల స్టంట్ మాత్రమేనని వామపక్షాలు కొట్టిపారేస్తున్నాయి.

ఏపీలో 2019లో వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత కొద్ది రోజుల పాటు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ వ్యవహరించారు. ఆయన హయాంలో రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఆ తరువాత కొద్దిరోజులకే సోము వీర్రాజును అధ్యక్షుడిగా నియమించారు. ఆయన హయాంలో బీజేపీలోని నలుగురు నేతలు అధికార పార్టీకి వంత పాడటమే కాకుండా, ప్రతిపక్షంలో ఉన్న టీడీపీని టార్గెట్ చేయడం ప్రారంభించారు. రాజధాని అమరావతి ఉద్యమంలో కూడా బీజేపీ నేతలు వ్యవహరించిన తీరు రాష్ట్రంలో బీజేపీని అప్పట్లో ప్రజల నుంచి దూరం చేసింది. ఆ తరువాత కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్ర బీజేపీ నేతలకు క్లాస్ తీసుకున్నప్పటికీ కొంతమంది బీజేపీ నేతల వ్యవహారశైలి మారలేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పురందేశ్వరి పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత పాత కార్యవర్గాన్ని మార్చివేశారు. రాష్ట్రంలో బీజేపీ, వైసిపి ఒకటి కాదు అనే అంశాన్ని ముందు నిరూపించాలని పలువురు కేంద్ర హైకమాండ్ వద్ద చెప్పారు. ఆ అపవాది నుంచి బయటపడితేనే రాష్ట్రంలో బీజేపీ బతికి బట్టకడుతుందని వ్యాఖ్యానించారు. దీంతో పురందేశ్వరి రాష్ట్ర ప్రభుత్వంపై వివిధ అంశాలను ఎంచుకొని విరుచుకుపడటం ప్రారంభించింది. మద్యంపై క్షేత్రస్థాయి నుంచి ఆందోళన చేసిన బీజేపీ నేతలు.. రాష్ట్రంలో మద్యం కుంభకోణం, వేల కోట్ల రూపాయలు దుర్వినియోగమవుతున్నాయని, దీనిపై సిబీఐ విచారణ జరపాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు స్వయంగా లేఖ అందించారు. ఆ తరువాత ఇసుక కుంభకోణాన్ని కూడా పురందేశ్వరి బహిర్గతం చేశారు. దీంతో, విజయసాయిరెడ్డి పురందేశ్వరిని టార్గెట్ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబానికి ఉన్న బంధుత్వాన్ని ప్రస్తావిస్తూ పురందేశ్వరి రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా కాకుండా, టీడీపీ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

రాష్ట్ర బీజేపీ కూడా ఈ అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని పురందేశ్వరి భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. ఉత్తరాంధ్రాలో వైసిపి ఇన్‌చార్జిగా ఉండి అక్కడ ఉన్న వారిని బెదిరించి కడప గూండాలను అక్కడికి తరలించి స్థలాలను కబ్జా చేయడం, లాగేసుకోవడం వంటి కార్యక్రమాలకు పాల్పడ్డారని లేఖలో పేర్కొన్నారు. దసపల్లా భూములను కూడా బెదిరించి లాగేసుకున్నారని, తన కూతురు, అల్లుడు పేరిట పలు భూములను రాయించుకున్నారని ఆరోపించారు. చివరకు వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య జరిగితే ఆయనకు గుండె పోటు అని కట్టు కథ అల్లిన విజయసాయిరెడ్డి.., ఆ తరువాత హత్య జరిగిందని సిబీఐ చార్జ్‌షీట్ వేస్తే ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. పది సంవత్సరాల నుంచి బెయిల్‌పై ఉన్న విజయసాయిరెడ్డి, జగన్ అక్రమాస్థుల కేసులో కింగ్ పిన్ అని సీబీఐ పేర్కొన్న విషయాన్ని లేఖలో వివరించారు. దీనిపై అవసరమైతే నాంపల్లి సిబీఐ కోర్టులో కూడా పిటీషన్ వేసేందుకు బీజేపీ సిద్దమవుతోంది. అయితే, విజయసాయి రెడ్డి, పురందేశ్వరిని టార్గెట్ చేసి మాట్లాడటం పట్ల రాష్ట్ర బీజేపీ నేతలు కొంతమంది సీరియస్‌గా ఉన్నారు. హైకమాండ్ దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకెళ్లాలని నిర్ణయించారు. బీజేపీ, వైసిపి మధ్య పెరిగిన మాటల యుద్దం నేపథ్యంలో రాష్ట్రంలో మద్యం కుంభకోణంపై ఆధారాలతో సహా, హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసేందుకు బీజేపీ సిద్దమైంది.

అయితే, ఇదంతా లాలూచీ కుస్తీ అని వామపక్షాలు కొట్టిపారేస్తున్నాయి. అదనపు అప్పులకు అవకాశం ఇవ్వడం, కేంద్రం నిధులు మళ్లిస్తున్నా నోరు ఎత్తకపోవడం, రాష్ట్రంలో అరాచకాలు జరుగుతున్నా కేంద్రం స్పందించకపోవడం, పైగా తాము ఏం చేసినా కేంద్రానికి చెప్పే చేస్తున్నామని వైసిపి చెబుతున్నప్పటికీ, బీజేపీ కేంద్ర పెద్దలు నోరు ఎత్తకపోవడాన్ని పరిశీలిస్తే రాష్ట్రంలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ అనే విషయం నిజమవుతుందని వామపక్షాలు అంటున్నాయి.