ఇష్టదైవం హనుమంతుడి పాత్రలో చిరంజీవి.. ఫ్యాన్స్‌ ఖుషీ

టాలీవుడ్‌ మెగాస్టార్ చిరంజీవి అంటే నేటికీ యూత్‌లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఇండస్ట్రీలో ఆయన అంటే ఇష్టపడని వారు అంటూ ఉండరు. వివాదాలకు దూరంగా అందరినీ కలుపుకుపోవాలనే మనస్తత్వం ఆయనది. ఇప్పటికీ ఇండస్ట్రీలో నంబర్ 1గా కొనసాగుతున్నారు. ఆయన సినిమా విడుదల అయిందంటే థియేటర్ల వద్ద ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతారు. కటౌట్లు పెట్టి పాలాభిషేకాలు చేస్తుంటారు. ఇక బాక్సాఫీసు వద్ద కూడా ఆయన సినిమాలు కలెక్షన్ల వర్షం కురిపిస్తుంటాయి. ఏదేమైనా ఇండస్ట్రీలో తనకు ఎవరూ తెలియకపోయినా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఆయన మెగాస్టార్ అయ్యారు. ప్రతి తెలుగు వాడు అభిమానించే హీరోగా మారారు. ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో ఆయనకు ఓ కల వచ్చింది. ఆంజనేయుడు తన కలలోకి వచ్చి పేరును చిరంజీవిగా మార్చుకోమన్నారని మెగాస్టార్ గతంలో పలు సందర్భాలలో చెప్పారు. ఆయన ఇష్టదైవం కావడంతో కొణిదెల శివశంకర వరప్రసాద్ పేరును చిరంజీవిగా మార్చేసుకున్నారు. ఇక తెరపై అడపాదడపా హనుమంతుడి పాత్రలు పోషించినా అది కొద్ది సేపు మాత్రమే. అయితే ఆయన తన ఇష్టదైవం హనుమంతుడి ఫుల్ రోల్ పోషించే అవకాశం ఇప్పుడు ఆయనకు వచ్చింది.

మెగాస్టార్ చిరంజీవికి హనుమంతుడు అంటే చాలా ఇష్టం. తన ఇంట్లో ఏ శుభకార్యం తలపెట్టినా తొలుత హనుమంతుడికి ఆయన కుటుంబ సభ్యులు పూజ చేస్తుంటారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా అంతే. ఏ మంచి కార్యక్రమం తలపెట్టినా కొండగట్టు హనుమంతుడి ఆలయానికి వెళ్లి పూజలు చేస్తుంటారు. ఇక ప్రస్తుతం టాలీవుడ్‌ నుంచి పాన్ ఇండియా సినిమాలు రూపొందుతున్నాయి. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా హనుమాన్ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో హనుమంతుడి సన్నివేశాలు తప్పితే మిగిలిన సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిందని తెలుస్తోంది.

దీంతో ఆ పాత్ర సరిగ్గా చిరంజీవి అయితేనే న్యాయం చేయగలరని ప్రశాంత్ వర్మ నమ్ముతున్నారట. దీంతో చిరంజీవి వద్దకు ఈ ప్రతిపాదన తీసుకెళ్లినట్లు సమాచారం. ఆయన ఒక 10 రోజులు కాల్షీట్లు ఇచ్చినా షూటింగ్ పార్ట్ మొత్తం అయిపోతుందట. చిరంజీవి నిర్ణయం కోసం వీరు ఎదురు చూస్తున్నారు. ఇక చిరంజీవి తన ఇష్టదైవం హనుమంతుడి పాత్రలో కనిపిస్తాడని ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.