RRRలో జక్కన్న సర్‌ప్రైజ్.. ఏమిటో తెలుసా?

ఎప్పుడెప్పుడా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేయనుంది. మార్చి 25న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తగా భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు జక్కన్న అండ్ టీమ్ రెడీ అయ్యారు. ఇక ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కాగా ఈ సినిమా నుండి ఇప్పటివరకు ఆర్ఆర్ఆర్ థీమ్ సాంగ్, నాటు నాటు, ఎత్తర జెండా పాటలను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.

అయితే ఈ సినిమాలో ఓ సర్‌ప్రైజ్‌ను జక్కన్న చివరివరకు రివీల్ చేయకుండా ఉండేలా చూస్తున్నాడట. ఇంతకీ జక్కన్న ఇవ్వబోతున్న ఆ సర్‌ప్రైజ్ ఏమిటా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా, ఆయన సరసన సీత పాత్రలో ఆలియా భట్ నటిస్తోంది. వీరిద్దరి మధ్య ఓ రొమాంటిక్ సాంగ్‌ను చిత్రీకరించారట చిత్ర యూనిట్.

కానీ ఇప్పటివరకు ఈ పాటకు సంబంధించి ఎలాంటి క్లూ కూడా ఇవ్వలేదు. దీంతో ఈ పాటను నేరుగా థియేటర్లకు వచ్చే ఆడియెన్స్‌కు సర్‌ప్రైజ్‌గా ఇచ్చేందుకు జక్కన్న అండ్ టీమ్ ప్లాన్ చేస్తున్నారట. ఈ పాట అత్యద్భుతంగా రావడంతో ప్రేక్షకులకు ఇది ఖచ్చితంగా నచ్చుతుందని వారు అంటున్నారు. ఇక తారక్ కొమురం భీం పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ఆయన సరసన ఒలివియా మారిస్ హీరోయిన్‌గా నటిస్తోంది. అజయ్ దేవ్గన్, సముద్రఖని తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ విజువల్ వండర్ మూవీకి కీరవాణి సంగీతం అందిస్తుండగా, డివివి దానయ్య అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు.