పుష్ప, ఆర్ఆర్ఆర్ లకు బిగ్ రిలీఫ్..!

ఏపీలో సినిమాల విడుదల సమయంలో టికెట్ల ధరలు పెంచుకోవడానికి వెసులుబాటు కల్పిస్తూ కోర్టు తీర్పు ఇవ్వడం టాలీవుడ్ నుంచి రాబోయే భారీ చిత్రాలకు పెద్ద ఊరట గా నిలిచింది. కొన్ని నెలల కిందటి వరకు సినిమాల విడుదల సమయంలో టికెట్ల ధరలు పెంచుకునే వెసులుబాటు థియేటర్ల యజమాన్యానికి ఉండేది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆన్ లైన్ టికెటింగ్ విధానం అమలు చేస్తామని ప్రకటించి.. సినిమా టిక్కెట్ల ధర తగ్గిస్తూ జీవో జారీ చేసింది.

దీనిపై కొందరు డిస్ట్రిబ్యూటర్లు కోర్టుకు వెళ్లడంతో కొత్త సినిమాల విడుదల సమయంలో టికెట్ ధరలు పెంచుకునే వెసులుబాటు కల్పించింది. కోర్టు తీర్పు రాబోయే భారీ చిత్రాలకు ఎంతో ఉపశమనం కలిగించిందని చెప్పాలి. మొదటగా అల్లు అర్జున్ హీరోగా వస్తున్న పుష్ప సినిమాకు ఇది మేలు చేకూర్చనుంది. ఈనెల 17వ తేదీ ఈ సినిమా విడుదల కానుంది.

అలాగే నాని కెరీర్లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న శ్యామ్ సుందరాయ్ 24వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమాకు కూడా టిక్కెట్ల ధరల పెంపు మేలు జరుగనుంది.ఇక ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఎదురుచూస్తున్న రాజమౌళి సినిమా ఆర్ఆర్ఆర్ రూ.450 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. ఇప్పుడున్న టికెట్ ధరలతో ఈ సినిమా గనక విడుదల చేస్తే నష్టపోవడం ఖాయం అనే వ్యాఖ్యానాలు వినిపించాయి. ఆ చిత్ర నిర్మాత కూడా టికెట్ల ధరలపై పునరాలోచించాలని ప్రభుత్వాన్ని కూడా కోరారు.

ఈ నేపథ్యంలో కోర్టు ఇచ్చిన తీర్పు ఆర్ఆర్ఆర్ మూవీకి బిగ్ రిలీఫ్ గా మారింది. అలాగే సంక్రాంతి సందర్భంగా జనవరి 12 వ తేదీన విడుదల కానున్న పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్, 14వ తేదీన విడుదల కానున్న ప్రభాస్ రాధే శ్యామ్ సినిమాలకు పెరిగిన టికెట్ల ధరలు మేలు చేకూర్చనున్నాయి. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలన్నీ భారీగా ఓపెనింగ్స్ రాబట్టుకునేందుకు ఇప్పుడు వెసులుబాటు దక్కింది.