అభిమానులు సినీ దర్శకులు గా మారి.. తాము అభిమానించే హీరోలతో సినిమా చేస్తే ఇక ఆ సినిమాలు ఏ రేంజ్ లో ఉంటాయో చెప్పక్కర్లేదు. తమ అభిమాన హీరో తెరపై ఎలా కనిపిస్తే బాగుంటుందో అభిమానికి తప్ప మరెవ్వరికీ తెలియదు. వాళ్లు ప్రజెంట్ చేసినట్టుగా ఎవరూ చేయలేరు కూడా. మొదటి సారిగా చిరంజీవి కెరీర్లో ఆయన నటించే సినిమాలకు ఇద్దరు అభిమానులు దర్శకత్వం వహిస్తున్నారు. వారే యంగ్ డైరెక్టర్లు బాబీ, వెంకీ కుడుముల.
రవితేజ సినిమా పవర్ సినిమా తో దర్శకుడిగా మారిన బాబీ ఆ తర్వాత బలుపు, జై లవకుశ, సర్దార్ గబ్బర్ సింగ్, వెంకీ మామ వంటి సినిమాలకు దర్శకత్వం వహించాడు. బాబీ చిన్నప్పటి నుంచి చిరంజీవి ఫ్యాన్. చిరంజీవి అభిమానుల సంఘానికి ప్రెసిడెంట్ గా కూడా వ్యవహరించాడు. చిన్న వయసులోనే చిరంజీవిని స్వయంగా ఎన్నో సార్లు కలిశాడు. ఇప్పుడు అతనికి ఏకంగా చిరంజీవి సినిమాకు దర్శకత్వం వహించే ఛాన్స్ దక్కింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సినిమాలో చిరంజీవి హీరోగా నటిస్తుండగా బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు.
తన అభిమాన హీరోని బాబీ ఊర మాస్ గా చూపించనున్నాడు. ఇందుకు సంబంధించి ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లలో ఊర మాస్ లుక్ లో చిరంజీవి అదిరిపోయాడు. ఇక చిరంజీవి మరో అభిమానికి వెంకీకి కూడా దర్శకత్వం వహించే ఛాన్స్ ఇచ్చాడు. వెంకీ కుడుముల పలు వేదికల్లో తన అభిమాన హీరో చిరంజీవి అని ప్రకటించారు. అలాగే వెంకీ తన ఫ్యాన్ అని చిరంజీవి చాలా సందర్భాల్లో చెప్పాడు. వెంకీ కుడుముల నాగ శౌర్య హీరో గా నటించిన ఛలో సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. తన తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ సాధించాడు.
వెంకీ తన రెండో సినిమాగా నితిన్ హీరోగా భీష్మ అనే సినిమా తెరకెక్కించగా అది కూడా బంపర్ హిట్ అయింది. ఇప్పుడు వెంకీ ఏకంగా చిరంజీవితో సినిమా తీసే అవకాశాన్ని దక్కించుకున్నాడు. డీవీవీ దానయ్య నిర్మాణంలో చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న చిత్రానికి వెంకీ కుడుముల దర్శకత్వం వహించనున్నాడు. బాబీ చిరంజీవితో మాస్ సినిమా చేస్తుండగా ఇక వెంకీ ఏ టైప్ సినిమా చేస్తాడో చూడాల్సి ఉంది. ఇలా ఒకేసారి తన ఇద్దరు అభిమానులకు దర్శకత్వం వహించే ఛాన్స్ ఇచ్చాడు మెగాస్టార్ చిరంజీవి. మెగా బాస్ సినిమాలకు అభిమానులే దర్శకత్వం వహిస్తుండడంతో ఈ సినిమాలపై మెగాఫ్యాన్స్ లో భారీగా అంచనాలు ఉన్నాయి.