బండి స్పీడ్ కు గండి పడిందా.. గండి కొట్టారా..

జేపీ ఫైర్ బ్రాండ్ బండి సంజయ్  స్పీడ్ కు పార్టీలో కళ్లెమేశారా? కిషన్ వర్సెస్ సంజయ్ పోరులో కిషన్  రెడ్డే పైచేయి సాధించారా? బండి సంజయ్ ప్రారంభించే యాత్ర అందుకే వాయిదా పడిందా? అనే ప్రశ్నలు ఇపుడు రాజకీయ వర్గాల్లో జోరందుకున్నాయి. కేసీఆర్ ను తిడుతూ మీడియాలో నానే రాష్ట్ర బీజేపీ చీఫ్ ఇపుడు సైలెంట్ కావడంతోపాటు ఈనెల 9న చేపట్టనున్న పాదయాత్ర 24కు వాయిదా వేసినట్లు పార్టీ తెలిపింది. పార్లమెంటు సమావేశాల కారణంగా యాత్ర వాయిదా పడిందని చెబుతున్నా దీనికి హైకమాండ్ మద్దతు పలకలేదని తెలిసింది. ముందుగానే యాత్రకు సంబంధించి వివిధ కమిటీలు కూడా ఏర్పాటు చేశారు.  రేవంత్ రెడ్డి టీకాంగ్రెస్ అధ్యక్షుడు అయిన తరువాత సంజయ్ కు మీడియాలో పెద్దగా ప్రాధాన్యత దక్కడం లేదు. దీంతో అధికార పక్షాన్ని ఇరుకున పెట్టాలనే ఉద్దేశంతో పాదయాత్ర ప్లాన్ చేశాడు.

అయితే కిషన్ రెడ్డి రూపంలో దీనికి ఆటంకం ఏర్పడింది. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తరువాత పార్టీలో ఆయనదే పైచేయి అవుతోంది. హైకమాండ్ కు దగ్గరగా ఉండటం ఆయనకు కలిసొచ్చిన అంశం. కిషన్ రెడ్డి కూడా యాత్ర చేయాలని నిర్ణయించారు. జన ఆశీర్వాద యాత్ర పేరిట ఇది రాష్ట్రంలో జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ కిషన్ ప్లాన్ చేసుకున్నది మాత్రం కాదు.. సెంట్రల్ మినిస్టర్స్ జనంలోకి వెళ్లేందుకు వీలుగా దీనిని రూపొందించారు. బండి యాత్ర వాయిదా పడటానికి ఇది కూడా ఓ కారణం. జాతీయ పార్టీలలో నాయకులు, రాష్ట్ర అధ్యక్షులు హైకమాండ్ ఏం చెబితే అదే వినాలి.. ఇది తప్పదు.. లేకపోతే తోకలు కత్తిరిస్తారంతే. అది కాంగ్రెస్ పార్టీ అయినా.. బీజేపీ అయినా జరిగేదింతే.. వ్యక్తిగత ఇమేజ్ పెంచుకునే ప్రయత్నాలు చేస్తే మాత్రం పార్టీలో ఉండే సహచరులే హైకమాండుకు ఉప్పందిస్తారు.. ఇది సంజయ్ కు తెలియని రహస్యమేం కాదు..