అయ్యో..అయ్యొయ్యో.. ఇంతటి అవమానమా..

తాడిపత్రి.. ఎప్పుడూ మీడియాలో నానే పేరు.. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఈ పేరు వినిపిస్తూనే ఉంటుంది.  తాడిపత్రి అంటేనే జేసీ బ్రదర్స్ గుర్తుకు వస్తారు. రాష్ట్ర రాజకీయాల్లో ఈ సోదరులు గతంలో ఓ వెలుగు వెలిగారు.  జేసీ దివాకర్ రెడ్డి తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల్లో ఉన్నపుడు హవా నడిచింది. అప్పుడు అధికారం ఉంది కాబట్టి వారిదే పైచేయి అయింది. ఇపుడు జేసీ దివాకర్ రెడ్డి రాజకీయాలకు కాస్త దూరంగా ఉండగా జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం తాడిపత్రి మున్సిపల్ చైర్మెన్ గా యాక్టివ్ పాలిటిక్స్ లో ఉన్నారు. అయితే సోమ, మంగళ వారాల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి మీడియా, సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. ఆయన ఏం చేసినా డిఫరెంట్ అన్నమాట.

ఇంతకీ ఏం జరిగిందంటే..  తాడిపత్రి అభివృద్ధిపై సోమవారం సమీక్ష నిర్వహిస్తామని, మున్సిపల్  కమిషనర్ తో పాటు సిబ్బందికి మున్సిపల్ చైర్మెన్ హోదాలో జేసీ ప్రభాకర్ రెడ్డి  మూడు రోజులు ముందుగానే సమాచారం ఇచ్చారు. అయితే అక్కడ రాజకీయాలు ఎప్పుడూ ఉప్పు..నిప్పులాగే ఉంటాయి కదా.  సోమవారం రానే.. వచ్చింది..  చైర్మెన్ తన కార్యాలయానికి వచ్చేశారు.. అయితే అధికారులు మాత్రం రాలేదు. ఆరా తీస్తే స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కూడా తన ఇంట్లో అధికారులతో మీటింగ్ ఏర్పాటు చేశారని తెలిసింది. దీంతో పవర్ ఉన్న ఎమ్మెల్యే కదా.. మధ్యాహ్నం వస్తారేమోనని జేసీ ఎదురు చూశారు. మధ్యాహ్నం కాదు కదా.. సాయంత్రం వరకూ ఎవరూ రాలేదు. కమిషనర్ అయితే ఏకంగా మధ్యాహ్నం లీవ్ తీసుకున్నారట. ఈ విషయం తెలుసుకున్న జేసీ ఊగిపోయారు.అరె.. చైర్మన్ అయిన నాకే ఇంత అవమానమా.. అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ సిబ్బందికి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారట. అంతేకాక.. సోమవారం మొత్తం ఆఫీసులోనే ఉండిపోయి నిరసన వ్యక్తం చేశారు. మంగళవారం ఉదయం స్నానపానాదులు కూడా మున్సిపల్ ఆఫీసులోనే ముగించారు. తరువాత నింపాదిగా మున్సిపల్ కమిషనర్ వచ్చి సమావేశం పెట్టుకుందాం రండి అంటే.. ఏం సమాధానం చెప్పాలో అర్థంకాక గుడ్లు ఉరిమారట.