ఏపీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణకు..ప్రతిపక్ష నేత జగన్ భయం పట్టుకుంది. సొంత నియోజకవర్గమైన శ్రీకాళహస్తిలో.. టీడీపీ క్యాడర్ అంతా వైసీపీలోకి వెళ్లిపోతుందనే ప్రచారం బొజ్జలను టెన్షన్ పెడుతోంది. మరో పక్క తనకు అత్యంత సన్నిహిత వ్యక్తులే.. జగన్‌లో టచ్‌లో ఉన్నారన్న విషయం తెలిసిన దగ్గర నుంచి ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నారట. తనపై క్యాడర్, నాయకులు అసంతృప్తిగా ఉన్నారన్న విషయం ఆలస్యంగా తెలుసుకున్నానని.. ఇప్పుడు తెగ ఫీలైపోతున్నారట. అసలే మంత్రి పదవి ఉంటుందో ఊడుతుందో తెలియక టెన్షన్ పడుతున్న ఆయన్ను ఇప్పుడు జగన్ కూడా టెన్షన్ పెడుతున్నారట.
సొంత నియోజకవర్గం శ్రీకాళహస్తిలో మంత్రి బొజ్జల గోపాలకృష్ణకు తలనొప్పి ఎదురవుతోంది. నియోజకవర్గంలోని టీడీపీ నేతలు బొజ్జల తీరుపై అసంతృప్తితో ఉన్నారట. ఆ బ్యాచ్ అంతా ఇప్పుడు వైసీపీ వైపు చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గంలో బొజ్జలకు మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే ఎమ్మెల్యే తర్వాత అంతటి కీలకమైన మున్సిపల్ చైర్మన్ ఈ మధ్య తిరుగుబాటు బావుటా ఎగరవేశారు. తానే ముఖ్యమంత్రిని కలిసి ఎమ్మెల్యే టికెట్ అడుగుతానని బొజ్జలకే సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో తనకు ఎమ్మెల్యే టికెట్ రాకపోతే… వైసీపీలోకి వెళ్లడానికి కూడా రెడీగా ఉన్నారని టాక్. బొజ్జల ఆయనను ఎంత బుజ్జగించాలని చూసినా ఫలితం దక్కలేదు.
దీని తర్వాత… ఇప్పుడు సర్పంచ్ ల వంతు వచ్చింది. ఆ సర్పంచ్ లంతా పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారట. వైసీపీ అధినాయకత్వానికి కబురు కూడా పంపారట. ముఖ్యంగా శ్రీకాళహస్తి మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి, ప్రస్తుతం రాచగన్నేరి సర్పంచ్ గా ఉన్న బొల్లినేని జగన్నాథం నాయుడు వీరందరికీ నాయకుడు.బొజ్జలకు బొల్లినేని అత్యంత సన్నిహితుడు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో టీడీపీకి కీలకమైన నాయకుడు. అందులోనూ బలమైన సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాంటి ఆయన బొజ్జల తీరుపై అసంతృప్తితో ఉన్నారట.
పార్టీలో ఉన్నా… మంత్రి వల్ల తనకు ఒరిగింది ఏమీ లేదని ఫీలవుతున్నారట. పార్టీ కోసం ఎంత కష్టపడ్డా తనకు గుర్తింపు లభించకపోవడంతో.. అసంతృప్తులందరినీ చేరదీశారట. బొల్లినేని ఇప్పటికే స్వయంగా జగన్ తోనూ మాట్లాడినట్టు ప్రచారం జరుగుతోంది. బొజ్జల ముఖ్య అనుచరులు కావడంతో జగన్ కూడా ఆయన రాకపై చాలా ఆసక్తి చూపిస్తున్నారట. పార్టీలోకి వస్తే తగిన ప్రాధాన్యం ఇస్తామని కూడా భరోసా ఇచ్చినట్టు టాక్. బొల్లినేని ఇక పార్టీ మారడం లాంఛనమేనని ప్రచారం జరుగుతోంది. జగన్ వల్లే తనకు నష్టం జరుగుతోందని తెగ ఫీలవుతున్నారట బొజ్జల!!