అల్లుడి కోసం బాల‌య్య త్యాగం

హీరో బాల‌కృష్ణ పేరు కొద్దిగా మారుతోంది! అదేంటి? ఎందుకు? అంటారా? అక్క‌డ‌కే వ‌చ్చేద్దాం. త‌న అల్లుడు, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేష్ కోసం బాల‌య్య త‌న పొలిటిక‌ల్ లైఫ్‌ని త్యాగం చేసేందుకు రెడీ అవుతున్న‌ట్టు తెలుస్తోంది. అందుకే ఆయ‌న పేరు బాల‌య్య ప్లేస్‌లో త్యాగ‌య్య‌గా మారిపోతోందేమో అంటున్నారు అభిమానులు. విష‌యంలోకి వెళ్తే.. తాజాగా ఏపీలో టీడీపీ ఎమ్మెల్సీ సీట్ల పంప‌కం పూర్త‌యిపోయింది. ముందుగానే వేసుకున్న స్కెచ్ ప్ర‌కారం ఓ ఎమ్మెల్సీ సీటుని సీఎం చంద్ర‌బాబు త‌న కుమారుడికి క‌ట్ట‌బెట్టారు. అటు పిమ్మ‌ట ఆయ‌న‌ను మంత్రి వ‌ర్గంలోకి తీసుకుంటున్నారు కూడా.

అయితే, విప‌క్షాలు ఊరుకుంటాయా? ఇప్ప‌టికే నారా వారి ఫ్యామిలీపై ఇంతెత్తున లేస్తున్న విప‌క్షం జ‌గ‌న్ అండ్‌కోలు మ‌రింత రెచ్చిపోయారు. నారా లోకేష్‌.. కి ద‌మ్ము ధైర్యం లేద‌ని, అందుకే దొడ్డి దారిన ఎమ్మెల్సీ టికెట్‌తో మంత్రి అవుతున్నార‌ని ఏకేశారు. అంతేకాదు, వైకాపా అధికార ప్ర‌తినిధి అంబ‌టి రాంబాబు మ‌రో రెండ‌డుగులు ముందుకేసి.. ద‌మ్ము ధైర్యం ఉంటే.. ఎమ్మెల్యేగానే పోటీ చేసి గెల‌వాల‌ని స‌వాల్ విసిరారు. ఈ స‌వాళ్లు.. ద‌మ్ములు వంటి వాటిని కొంచెం సేపు ప‌క్క‌న‌పెడితే.. ఇదే విష‌యంపై బాల‌య్య స్పందించాడు.

నిన్న అమ‌రావ‌తికి వెళ్లిన బాల‌య్య‌.. త‌న అల్లుడు లోకేష్‌కి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వ‌డంపై వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌కు ప‌క్కాగా, సైలెంట్‌గా జ‌వాబు చెప్పేశాడు. లోకేష్ చూపించిన క‌సి, ప‌ట్టుద‌ల‌, క‌ష్టం వంటి వాటిని ప్రాతిప‌దిక‌గా తీసుకునే చంద్ర‌బాబు ఆయ‌న‌కు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చార‌ని అన్నారు. అయితే, రాబోయే రోజుల్లో మంత్రి సీటు కేటాయించినా కూడా బాల‌య్య ఈ త‌ర‌హాలోనే కామెంట్ చేసే ఛాన్స్ లేక‌పోలేదు.

వాస్త‌వానికి బాల‌య్య‌ను మంత్రి వ‌ర్గంలోకి తీసుకోవాల‌ని కొన్నాళ్లుగా సూచ‌న‌లు వ‌స్తున్నాయి. బాల‌య్య‌కి కూడా మంత్రి వ‌ర్యా అని పిలిపించుకోవాల‌నే ఉంది. కానీ, అల్లుడి కోసం.. దానిని కూడా త్యాగం చేసి త‌న ప్లేస్‌లో లోకేష్‌ని చూసుకుని మురిసిపోతాడేమో చూడాలి. ఎంతైనా అల్లుడు, మామ‌ల మ‌ధ్య ఆ మాత్రం త్యాగం ఉండాల్సిందేనేమో!!