రోజాకు రజనీ సెగలు..నగరిలో తమిళ ఓట్లు ఎఫెక్ట్.!

అధికారంలో ఉంటే ఏదైనా మాట్లాడవచ్చు అనే తీరులో వైసీపీ నేతలు ఉన్నారనే చెప్పాలి. ఇంకా తాము ఏం మాట్లాడిన ప్రజలు నమ్ముతారు..ప్రజలు అంగీకరిస్తారు అనే భావనలో ఉన్నట్లు కనిపిస్తున్నారు. అందుకే సూపర్ స్టార్ రజనీకాంత్‌ని సైతం వైసీపీ నేతలు తిడుతున్నారు. ఆయన ఏదో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ఉన్నాయని మన రాష్ట్రానికి వచ్చారు..ఎన్టీఆర్ తో తనకున్న అనుబంధంతో పాటు..ఎన్టీఆర్ గొప్పతనం గురించి చెప్పారు. అలాగే చంద్రబాబు విజన్‌ని మెచ్చుకున్నారు.

అంతే వైసీపీ ప్రభుత్వాన్ని గాని, జగన్‌ని గాని ఒక్క మాట అనలేదు. అయినా సరే చంద్రబాబుని పొగడటమే రజనీ తప్పు అన్నట్లు వైసీపీ నేతలు తిడుతున్నారు. ఆయనొక సన్యాసి అని కొడాలి నాని అంటున్నారు. అలాగే బాడీ షేమింగ్ చేస్తున్నారు. ఇక మిగతా నేతల కంటే రజనీతో పరిచయం లేదు..కానీ ఆయనతో కలిసి సినిమాల్లో పనిచేసిన మంత్రి రోజా సైతం విమర్శించడమే హాట్ టాపిక్ అయింది. రజనీ కాంత్ హీరో కాదు జీరో అన్నట్లు మాట్లాడుతున్నారు. అంటే అధికారంలో ఉన్నారు కాబట్టి..రజనీకాంత్ లాంటి వారిని సైతం రోజా విమర్శించే స్థాయికి దిగజారిపోయారని విమర్శలు వస్తున్నాయి.

అయితే ఆమె భర్త సెల్వమణి తమిళనాడుకు చెందిన డైరక్టర్..అయినా సరే రోజా పదవి కోసం వెనక్కి తగ్గడం లేదు. ఇలా రోజా విమర్శించడంపై రజనీ ఫ్యాన్స్ సీరియస్ గానే ఉన్నారు. ఎలాగో రోజా ప్రాతినిధ్యం వహించే నగరి నియోజకవర్గంలో తమిళ ఓటర్ల ప్రభావం ఉంటుంది. దీంతో ఎన్నికల సమయంలో రోజాకు తమ సత్తా ఏంటో చూపిస్తామని నగరిలో ఉన్న రజనీ ఫ్యాన్స్ అంటున్నారు. రోజా అనవసరంగా జగన్‌కు మెప్పు కోసమని రజనీని తిట్టి ఇప్పుడు చిక్కుల్లో పడ్డారని, అసలే నగరిలో నెగిటివ్ ఉందని, ఇప్పుడు మరింత పెంచుకున్నారని కామెంట్లు వస్తున్నాయి.