ఎమ్మెల్యేలని వదలని లోకేష్..వైసీపీకి రిస్క్ పెరుగుతుందా?

యువగళం పేరుతో నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. గత మూడు నెలల నుంచి లోకేష్ పాదయాత్ర కొనసాగుతుంది..రాయలసీమ జిల్లాల్లో లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో పాదయాత్ర ముగించుకుని కర్నూలు జిల్లాలో లోకేష్ పాదయాత్ర కొనసాగుతుంది. లోకేష్ అనూహ్యంగా ప్రజలతో మమేకం అవుతూ ముందుకెళుతున్నారు. ఎక్కడకక్కడ టి‌డి‌పికి పట్టు పెరిగేలా ప్లాన్ చేస్తున్నారు.

ప్రతి వర్గాన్ని కలుసుకుంటూ వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. ఇక లోకేష్ ఎక్కడ పాదయాత్ర చేస్తే..ఆ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యేని గట్టిగా టార్గెట్ చేస్తున్నారు. స్థానికంగా ఉండే సమస్యలని ప్రస్తావిస్తూనే..ఎమ్మెల్యేలు అక్రమాలు అంటూ పెద్ద చిట్టా విప్పుతున్నారు. ఇప్పటివరకు లోకేష్ పాదయాత్ర చేసే నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలని గట్టిగా టార్గెట్ చేసి ముందుకెళుతున్నారు. ఇక తాజాగా కోడుమూరులో లోకేష్ పాదయాత్ర కొనసాగింది. అక్కడ ఎమ్మెల్యే సుధాకర్, వైసీపీ నేత హర్షవర్ధన్ రెడ్డి టార్గెట్ గా లోకేష్ విరుచుకుపడ్డారు.  కోడుమూరు నియోజకవర్గంలో రియల్‌, షాడో ఎమ్మెల్యేలు ఉన్నారని, ఒకరు సుధాకర్‌.. మరొకరు ఎమ్మెల్యే హర్షవర్దన రెడ్డి అని లోకేష్ ఫైర్ అయ్యారు.

ఇక ఈ ఇద్దరు భూములు, ఇసుక, ఎర్రమట్టిని దోచేస్తున్నారని,  ఇక్కడ పెత్తనమంతా షాడో ఎమ్మెల్యే హర్షవర్దన రెడ్డిదే అని, ఎక్కడ రియల్‌ ఎస్టేట్‌ వెంచరు వేయాలన్నా ఈ షాడో ఎమ్మెల్యే, ఆయన అనుచరులకు పది శాతం కప్పం కట్టాల్సిందే అని ఆరోపించారు. ఇలా వైసీపీ నేతలు టార్గెట్ గా లోకేష్ ఫైర్ అయ్యారు. అయితే ఇలా లోకేష్…స్థానిక వైసీపీ నేతలపై చేసే విమర్శలు ప్రజల్లోకి వెళుతున్నాయి. దీని వల్ల వైసీపీకి కాస్త నెగిటివ్ అవుతుంది. మొత్తానికి లోకేష్ పాదయాత్ర వల్ల వైసీపీ ఎమ్మెల్యేలకు ఇంకా రిస్క్ పెరుగుతుందని చెప్పాలి.