టీడీపీ-జనసేనతో కమ్యూనిస్టులా? కమలమా?

ఏపీలో ఏ పార్టీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి రెడీగా ఉంది..వచ్చే ఎన్నికల్లో ఎవరెవరు కలిసి పనిచేయనున్నారు? అంటే ఇప్పుడే ఆ అంశం క్లారిటీ వచ్చే ఛాన్స్ లేదు. టీడీపీతో కలిసి జనసేన పొత్తు పెట్టుకోవడానికి రెడీగానే ఉంది. కానీ జనసేన ఏమో బి‌జే‌పితో పొత్తులో ఉంది. బి‌జే‌పి ఏమో టి‌డి‌పితో కలవడానికి సిద్ధంగా లేదు. ఇటు టి‌డి‌పి సైతం జనసేనతో ఓకే గాని..బి‌జే‌పితో పొత్తు అంటే ఆలోచిస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో బి‌జే‌పిపై నెగిటివ్ ఉంది. కాకపోతే కేంద్రంలో అధికారంలో ఉండటం వల్ల బి‌జే‌పితో కలవాల్సిన పరిస్తితి ఉంది.

అలా అని బి‌జే‌పితో కలిస్తే రాష్ట్రంలో నష్టం జరిగే ఛాన్స్ కూడా ఉంది. అయితే పవన్ ఏమో బీజేపీతో పొత్తులో ఉండటం వల్ల..ఆ పార్టీని కలుపుకుని రావాలని చూస్తున్నారు. ఇదే సమయంలో బి‌జే‌పితో పొత్తు పెట్టుకుంటే నష్టమే అనే అంచనాలు ఉన్నాయి. ఇటు బి‌జే‌పి కలవకపోతే..టి‌డి‌పి-జనసేనతో కలవాలని కమ్యూనిస్టులు చూస్తున్నాయి. బీజేపీ, వైసీపీలకు వ్యతిరేకంగా ఒక కూటమి కావాలని, దానిలో టీడీపీ, జనసేన, సీపీఐ, సీపీఎం ఉంటేనే వైసీపీపై విజయం సాధ్యమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అంటున్నారు.

వాస్తవంగా బీజేపీ, జనసేన కలిసి పోటీచేస్తే జగన్‌ నెత్తిన పాలు పోసినట్టే అవుతుందని, అప్పుడు వైసీపీని ఓడించడం కష్టంగా మారుతుందని నారాయణ చెబుతున్నారు. ఏపీ ప్రయోజనాలకు బీజేపీ వ్యతిరేకమని, విభజన చట్టాలను అమలు పరచడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు. పోలవరానికి నిధులు ఇవ్వలేదని, అలాంటి పార్టీకి ప్రజలు ఓట్లు వేస్తారనుకోవడం లేదని చెప్పుకొచ్చారు.

అందుకే నారాయణ కొత్తగా టి‌డి‌పి-జనసేన-సి‌పి‌ఐ-సి‌పి‌ఎం కాంబినేషన్ చెబుతున్నారు. అయితే చంద్రబాబు, పవన్ పొత్తులపై ఎలా ఆలోచిస్తారో చూడాలి. చివరికి ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకుంటారో.