బందరు-గుడివాడల్లో టీడీపీ మైలేజ్ పెంచుతున్న వైసీపీ!

ఉమ్మడి కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ నిదానంగా బలపడుతుంది…గత ఎన్నికల్లో జిల్లాలో వైసీపీ హవా నడిచిన విషయం తెలిసిందే. కానీ నిదానంగా జిల్లాలో రాజకీయం మారుతుంది. కొందరు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరగడం టీడీపీకి కలిసొస్తుంది. అదే సమయంలో వైసీపీ అధికార బలం వాడి టీడీపీని అణిచివేసే కార్యక్రమాలు చేస్తున్న విషయం తెలిసిందే. కానీ అదే రివర్స్ అయ్యి ప్రజల్లో టీడీపీపై సానుభూతి పెరిగేలా చేస్తుంది.

తాజాగా మచిలీపట్నం(బందరు), గుడివాడ నియోజకవర్గాల్లో జరిగిన సంఘటనలు టీడీపీకి కలిసొస్తున్నాయి. ఇప్పటికే బందరు టీడీపీ ఇంచార్జ్‌గా ఉన్న కొల్లు రవీంద్రని పలుమార్లు అరెస్టులు చేసిన విషయం తెలిసిందే. అప్పటికే ఆయనపై సానుభూతి పెంచారు. తాజాగా బందరులో వైసీపీ కార్యాలయానికి కోట్ల విలువ చేసే ప్లేస్‌ని అప్పనంగా కట్టబెడుతున్నారని చెప్పి..కొల్లు నిరసన తెలియజేశారు. ఆ స్థలాన్ని పరిశీలించేందుకు వెళ్లారు. అయితే కొల్లుని వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. పలువురు టీడీపీ కార్యకర్తలని అదుపులోకి తీసుకున్నారు. ఈ అంశం కాస్త బందరు మొత్తం హాట్ టాపిక్ అయింది.

వైసీపీ అక్రమాలు చేస్తూ..టీడీపీ నేతలని పోలీసుల చేత ఇబ్బందులకు గురి చేస్తున్నారనే అంశం హైలైట్ అవుతుంది. దీంతో టీడీపీపై సానుభూతి పెరుగుతుంది. అటు తాజాగా గుడివాడలో పేదల ఇళ్ల కోసం నిరసన చేస్తున్న టీడీపీ ఇంచార్జ్ రావి వెంకటేశ్వరావుని పోలీసులు అదుపులోకి తీసుకుని చుట్టుపక్కల ఉన్న స్టేషన్లు మొత్తం తిప్పారు. చివరికి పమిడిముక్కల స్టేషన్‌లో ఉంచారు. రాత్రి ఆయన అక్కడే పడుకున్నారు.

ఇలా ప్రజల కోసం పోరాడుతున్న రావిని అరెస్ట్ చేయడం అన్యాయం అని టీడీపీ శ్రేణులు ఫైర్ అవుతున్నాయి. ఇలా అధికార బలాన్ని ఉపయోగించడం వల్ల వైసీపీ ఆటోమేటిక్ గా టీడీపీ నేతలకు సానుభూతి పెంచుతుంది.