దోపిడీని అడ్డుకుంటే సినిమా ఆపేస్తారా?

భారీ చిత్రాల ముసుగులో.. సినిమా ఇండస్ట్రీ సాగిస్తున్నది కేవలం దోపిడీ మాత్రమే అని చెప్పడానికి ఇది మరొక స్పష్టమైన ఉదాహరణ. ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల వాయిదాపడడం ఇదే విషయాన్ని నిరూపిస్తోంది. ఎన్నడో అక్టోబరులోనే విడుదల కావాల్సి ఉన్న ఈ చిత్రాన్ని.. అటూ ఇటూ చేసి.. సంక్రాంతి బరిలోకి తెస్తున్నాం అంటూ మొత్తానికి జనవరి 7న విడుదల అయ్యేలా ప్లాన్ చేశారు. ప్రస్తుతం అది కూడా వాయిదా పడింది.

చాలా రాష్ట్రాల్లో సినిమా థియేటర్లు మూత పడుతున్న నేపథ్యంలో వేరే గత్యంతరం లేకుండాపోయిందని.. సినిమా విడుదలను వాయిదా వేస్తున్నామని సినిమా టీమ్ ప్రకటించింది. కనీసం విడుదలను ఎప్పటికి ప్లాన్ చేస్తున్నారనే సంగతిని కూడా వెల్లడించలేదు. అంటే నిరవధికంగా వాయిదా వేసినట్లే అర్థం చేసుకోవాలి.
భారీ సినిమాల ముసుగులో.. సినీ ప్రియుల బలహీనతను ఆసరాగా చేసుకుని.. ఎడాపెడా దోచుకోవడమే లక్ష్యంగా పెద్ద సినిమాలు తయారవుతున్నాయా? అంటే అవుననే చెప్పాలి. దానికి నిదర్శనమే.. ఆర్ఆర్ఆర్ వాయిదా. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా ప్రదర్శన వాతావరణం మొత్తం మారిపోయింది. ఈ రంగంలో పైకి కనిపించకుండా సాగిపోతూ ఉన్న వందల కోట్ల దోపిడీకి చెక్ పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కత్తి దూసింది.

సినిమా థియేటర్ల నిర్వహణలో కనీస ప్రమాణాలు, అవసరమైన తప్పనిసరి అయిన నిబంధనలు పాటించకుండా చెలరేగుతున్న అనేక థియేటరన్లను ప్రభుత్వాధికారులు మూసివేయించారు. థియేటర్ యజమానులు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. నిబంధనలు కూడా పాటించకుండా సినిమా హాలు నడుపుకోవాలని ఏ ఒక్కరూ ప్రభుత్వం వద్దకు మంతనాలకు కూడా వెళ్లలేరు. వెళ్లినా వారికే సిగ్గుచేటు! అదే సమయంలో.. సినిమా విడుదల రోజున.. తమకు ఇష్టమొచ్చిన రీతిలో అదనపు షోలు వేసుకోవడానికి, టికెట్ల ధరలు పెంచి అమ్ముకోవడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతులు ఇచ్చేది లేదని ఏపీ సర్కారు తేల్చేసింది.

అసలు నగరాలు, మునిసిపాలిటీలు, పంచాయతీలకు విడివిడిగా సినిమా టికెట్ ధరలను నిర్ణయిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కోర్టు బ్రేక్ వలన కార్యరూపంలోకి రాలేకపోయింది గానీ.. సినిమా టికెట్లను తమ ఇష్టానుసారంగా నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు పెంచుకోవచ్చునా లేదా అనేది ఇప్పటికీ ప్రభుత్వం చేతుల్లోనే ఉంది. దాన్ని సర్కారు గట్టిగా బిగించింది. కేవలం.. సినిమా విడుదల అయిన తొలివారం టికెట్ల పెంపుద్వారా చేసే దోపిడీ మాత్రమే ఆధరవుగా బతుకుతున్న సినిమా ఇండస్ట్రీ.. ఏపీ సర్కారు నిర్ణయంతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది.

పేరుకు వాళ్లు పాన్ ఇండియా సినిమాగా తీస్తున్నా సరే.. ఏపీ మార్కెట్ దోపిడీ కుదరకపోతే.. సినిమా లాభాల మీద బాగా ఎఫెక్ట్ పడుతుందనే సంగతి వారికి తెలుసుగనుకనే.. విడుదలను వాయిదా వేసుకున్నారు. ఆర్ఆర్ఆర్ వాయిదా అనేది.. మొత్తం సినిమా రంగం పోకడల్లో రాబోయే రోజుల్లో- రాగల మార్పులకు శ్రీకారం అనుకోవాలి.