దొందూ దొందే.. ఎన్ని సార్లు కలిసినా ఏమీ తేలదు!

సాధారణంగా మనం దొందూ దొందే అనే సామెతను ఒకే రకంగా బుద్ధులు ప్రదర్శించే ఇద్దరు వ్యక్తుల గురించి అంటూ ఉంటాం. అయితే ఇక్కడ వ్యవహారం అది కాదు. రెండు సమస్యల గురించి. అవి స్తంభించిపోయిన తీరు గురించి. ఏపీ రాష్ట్ర వ్యవహారాల్లో రెండు కీలకమైన విషయాలు.. ఒకేరీతిగా స్తంభించిపోయి ఉన్నాయి. ఇవి మాత్రం దొందూ దొందే. ఇప్పట్లో అవి తేలి, ఒక కొలిక్కి వచ్చే అవకాశం కూడా కనిపించడం లేదు. అవేంటంటే.. (1) ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న పీఆర్‌సీ పెంపు (2) సినిమా థియేటర్ల మూత వ్యవహారం!

పీఆర్సీ పెంపు వ్యవహారం చాన్నాళ్లుగా పెండింగ్ లో ఉన్న వ్యవహారం. అధికారంలోకి వచ్చిన వెంటనే.. వారికి మేలు చేసేస్తానని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చిన మాట కూడా వాస్తవం. కానీ.. ఇప్పుడు అన్ని లెక్కలూ చూసుకుని, తూకాలన్నీ పూర్తి చేసేసరికి 14.29 శాతానికి మించి ఫిట్మెంట్ ఇవ్వలేమని, ఇవ్వబోమని ప్రభుత్వం భీష్మించుకు కూర్చుంది. ఉద్యోగుల డిమాండ్ తో పోల్చిచూసినప్పుడు ఇది చాలా చాలా తక్కువ. అందుకే.. ఆ ప్రతిపాదన మీద ఉద్యోగ సంఘాలు భగ్గుమంటున్నాయి.

కొన్ని వారాలుగా ఉద్యోగ సంఘాలన్నీ కలిసి ఎన్నడూ లేనంతగా ఒక్క తాటిమీదకు వచ్చి ప్రభుత్వంతో చర్చలు జరపుతూనే ఉన్నాయి. ఏమాత్రం తగ్గేది లేదని ప్రకటనలు గుప్పిస్తూ సమ్మె పేరుతో ఒత్తిడి పెంచుతున్నాయి. ప్రభుత్వం తరఫు నుంచి ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చలు జరిపే వ్యక్తులు మారుతున్నారే తప్ప.. చర్చలు మాత్రం ఒక కొలిక్కి రావడం లేదు. తొలుత సజ్జల, బుగ్గన చర్చలు జరిపారు. ఆ మరునాడు సీఎం చర్చిస్తారని అన్నారు. అది జరగలేదు. మరోమారు వారే చర్చలు జరిపి ఉద్యోగులు ఒప్పుకోకపోయేసరికి.. చర్చల బాధ్యతను సీఎస్ ఇతర అధికార్ల మీదకు నెట్టేసి చేతులు దులుపుకున్నారు.

ఈ చర్చలు సాగుతూనే ఉన్నాయి. ప్రతిరోజూ ఒకే చోటకు వచ్చి చర్చలు ఆగిపోతాయి. అంతే!

మరో వ్యవహారం సినిమా థియేటర్ల మూతకు సంబంధించినది. కొన్ని థియేటర్లపై అదికారులు దాడులుచేసి.. నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని మూసివేయించారు. కొన్నింటిని.. థియేటర్ యజమానులే తమంతట తామే మూసేశారు. వారందరూ కూడా నిబందనలకు విరుద్ధంగా నడుపుతున్నవారే. రేపోమాపో.. అధికారులు వచ్చాక సీజ్ చేయించుకోవడం కంటె.. ఏదో తామే మూసేసినట్టుగా కొంత బిల్డప్ ఇస్తే.. కాస్త వ్యతిరేకిస్తున్నట్లుగా కనిపిస్తుందని వారు భావించి ఉండవచ్చు. మొత్తానికి వందకుపైగా థియేటర్లు రాష్ట్రంలో మూతపడ్డాయి.

ఆనాటినుంచి ఈనాటి దాకా సినిమాటోగ్రఫీ శాఖకు సంబంధించిన మంత్రి పేర్ని నానితో వారి చర్చలు సాగుతూనే ఉన్నాయి. పేర్నినాని వారికి ఏదో ఒక ముచ్చట చెప్పి వెనక్కు పంపుతున్నారు. ఇవాళ.. జేసీల దగ్గరకెళ్లి అనుమతులు తీసుకోవాల్సిందిగా నాని చెప్పినట్టు వార్తలు వచ్చాయి. అయితే అందుకు ఓ కండిషన్ ఉంది. ఒక నెలలోగా.. అన్ని నిబంధనలు పాటించేలా అనుమతులు తెచ్చుకుంటామని రాతపూర్వకంగా ఇవ్వాలి. ఇది కూడా ఒక పట్టాన తేలే వ్యవహారం కాదు. పేర్ని నాని మాటలతో.. పరమపదసోపానపటంలో మళ్లీ ఒకటో గడికి వచ్చినట్టు అయింది.

ఈ రెండు వ్యవహారాల్లో ఒక సారూప్యత ఉంది. రెండింటినీ కలిపి జమిలిగా దొందూ దొందే అన్నది అందుకే. ఈ రెండు వ్యవహారాల్లోనూ సాక్షాత్తూ ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని వీరితో మాట్లాడితే తప్ప పరిష్కారం ఉండదు. కానీ.. ముఖ్యమంత్రి మాట్లాడరు. అందుకే ఇవి అలా స్తంభించిపోయి మాత్రమే ఉంటాయి. అంతే!!