వైసీపీ ఎమ్మెల్యేలపై జనం మంటెత్తి ఉన్నారా?

మునిసిపాలిటీ ఎన్నికల్లో ఫ్యాను గుర్తుకు ఓటు వేయడానికి- వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి, ఆ సీట్లో కొనసాగడానికి సంబంధం లేదనే సంగతి ప్రజలకు చాలా బాగా తెలుసు. అందుకే సాధారణంగా ఇలాంటి స్థానిక ఎన్నికలను పార్టీల కంటె కూడా, స్థానికంగా నాయకుల సొంత బలం, వారి పరిచయాలు ప్రభావితం చేస్తుంటాయి. కానీ ఈ ఎన్నికల్లో వైసీపీకి రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఇదంతా కూడా జగన్మోహన రెడ్డి సర్కారు చేపడుతున్న సంక్షేమ పథకాలకు దక్కిన ప్రజల దీవెనగా ఆ పార్టీ నాయకులు చెప్పుకుంటున్నారు. అయితే ప్రత్యేకించి కొన్ని అంశాలను, కొన్ని ఫలితాలను గమనించినప్పుడు.. వైఎస్సార్ కాంగ్రెస్ కు చెందిన ఎమ్మెల్యేల మీద ప్రజలు మంటెత్తిపోయి ఉన్నారని మనకు అర్థమవుతుంది. ఎలాగంటే..

బుగ్గన రాజేంద్రనాధరెడ్డి .. జగన్ కేబినెట్ లో మేధావులైన మంత్రుల్లో ఒకరు. చాలా మంది మంత్రుల్లాగా అవాకులు చెవాకులు పేలకుండా గౌరవంగా మాట్లాడుతుంటారు. అయితే ఆయనకు స్థానికంగా ఉన్న ప్రజాదరణ ఎంత? ఆయన సొంత నియోజకవర్గం పరిధిలోని బేతంచర్ల నగరపంచాయితీకి ఎన్నికలు జరిగాయి. వైసీపీనే గెలిచింది. అయితే.. బుగ్గన రాజేంద్రనాధరెడ్డి సొంత వార్డులో వైసీపీ ఓడిపోయింది. అంటే సాక్షాత్తూ ఆర్థిక మంత్రికి తన సొంత ఇంటి చుట్టుపక్కల పరిసరాల్లో ఎంత మంచి పేరు ఉందో దీన్ని బట్టి అర్థం అవుతోంది.

కడప జిల్లాలో కూడా ఎదురైన ఇలాంటి ఒక ఫలితం సాక్షాత్తూ ముఖ్యమంత్రికే అవమానకరం. కమలాపురం నియోజకవర్గంలో జగన్ మేనమామ రవీంద్రనాధరెడ్డి ఎమ్మెల్యే. ఆయన సొంత వార్డులో పార్టీ ఓడిపోయింది.

గుంటూరు లో ఇంకో కామెడీ. వైసీపీ కార్పొరేటర్ పాదర్తి రమేష్ గాంధీ మరణం వలన ఉపఎన్నిక జరిగింది. సహజంగా సిటింగ్ సీటు గనుక.. వైసీపీ ఎమ్మెల్యే గెలవాలి. కానీ ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థి సమత గెలుపొదారు.

దర్శి సంగతి చెప్పే పనే లేదు. మద్దిశెట్టి వేణుగోపాలరావు ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే. ఈ మునిసిపాలిటీని ఏకంగా తెలుగుదేశం చేజిక్కించుకుంది. కేవలం ఎమ్మెల్యే మీద స్థానికుల్లో అసంతృప్తి ఇక్కడ ఓటమికి కారణం అని స్పష్టమౌతోంది.

ఇలాంటి కొన్ని అంశాలను గమనించినప్పుడు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంక్షేమ పథకాలు పెద్ద బలం అయినప్పటికీ.. ఎమ్మెల్యేలపై లోకల్ గా వ్యతిరేకత శాపం అవుతుందేమో అనిపిస్తోంది